బతికున్న కూతురికి పేరెంట్స్ శ్రద్ధాంజలి..కులంతార వివాహం నేరమా..?
న్యూస్ వన్ టీవీ, వెబ్ డెస్క్: కులాంతర వివాహం చేసుకోవడం నేరమా? రోజురోజుకు టెక్నాలజీ మారుతున్నా… కొందరు కులం అనే మహమ్మారిని వదలడం లేదు. కూతురు కులాంతర వివాహం చేసుకుందని… ఏకంగా ఆమెకు శ్రద్ధాంజలి ఘటించారు పేరెంట్స్. గద్వాల్ జిల్లా గట్టుమండలంలో ఈ ఘటన వెలుగు చూసింది.
పెళ్లంటే నూరెళ్ల పంట..! అలాంటిది…. కూతురికి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునే స్వేచ్ఛ కూడా లేదంటున్నారు ఈ పేరెంట్స్. బ్రతికున్నవారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ.. పోస్టర్లు వేయడం ఎంత దుర్మార్గం…! శత్రువు కూడ ఇలాంటి పనిచేయడు. అలాంటిది అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి చేయడం కలిచివేసింది. మరి కూతురిపై వీరికి ఉన్న ప్రేమ ఇదేనా? కన్నకూతురికి కంటే వీరికి కులమే ఎక్కువ అయిపోయిందా?
ప్రేమ పెళ్లి చేసుకుంది… సాధారణ యువతి కూడా.. కాదు. ఆమె ఓ డాక్టర్. పెళ్లి చేసుకుంది కూడా… జులాయిని కాదు.. అతనో పోలీస్ కానిస్టేబుల్. ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. అభిరుచులు కలవడంతో… జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో పెద్దలకు చెప్పి ఒక్కటి అవాలని అనుకున్నారు. కాని పెద్దలు కులాలు వేరు కావడంతో… నో చెప్పారు. దీంతో.. ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇదే వీరు చేసిన నేరం. ఇందుకు శిక్ష ఏంటో తెలుసా? బతికుండానే శ్రద్ధాంజలి ఘటించడం.
శ్రద్ధాంజలి పోస్టర్లను సోషల్ మీడియాలో వైరల్ చేసి బంధువులకు కూడా పంపించారు. పోస్టులు చూసి బంధువులు కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే ఈ పోస్టర్ల వ్యవహారం ప్రేమ జంటకు తెలియడంతో చివరకు వారు గద్వాల్ పోలీసులను ఆశ్రయించారు. తమ తల్లిదండ్రుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, తమను కాపాడాలని గద్వాల్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు…..దీంతో తల్లిదండ్రులను పిలిపించి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు కూతురు చేసిన పనికి తమకు గ్రామంలో గౌరవం లేకుండా పోయిందని .. పొలం దగ్గరే జీవిస్తున్నామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.