సిని వార్తలు

సై అంటే సై సై…ఇద్దరు ఇద్దరే !

హైదరాబాద్ : అన్ స్టాపబుల్ అంటేనే అందరికీ గుర్తొచ్చేది నందమూరి బాలకృష్ణ…మొదట్లో ఆయన ఇలాంటివి నడిపించగలడా? యాంకరింగ్ చేయగలడా? అని చాలామంది అనుకున్నారు. ఎన్నో సందేహాలు మొదలయ్యాయి. కాకపోతే బాలకృష్ణ అందుకు ఒప్పుకోవడం ఒక ఎత్తయితే, తన మ్యానరిజానికి, తన స్టయిల్ కి, తన వాగ్ధాటికి తగ్గకుండా అన్ స్టాపబుల్ ప్రోగ్రామ్ ని ఒక స్థాయికి తీసుకువెళ్లింది మాత్రం…బాలకృష్ణ అంటే ఆశ్చర్యం అనిపించక మానదు. ఇంతకీ విషయం ఏమిటంటే…

పవర్ ఫుల్ డైలాగ్స్ తో అభిమానులతో క్లాప్స్ కొట్టించుకునే నందమూరి బాలకృష్ణ, ప్రత్యేకమైన యాక్టింగ్ తో మాస్ హీరోగా నిలిచిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇద్దరూ అన్ స్టాపబుల్ వేదికపై కలవనున్నారు. ఎప్పుడెప్పుడా అని అభిమానులు అందరూ ఎదురుచూస్తున్న ఆ శుభ సమయం రానే వచ్చింది.

ఇప్పుడా ఇద్దరూ కలిసి కవ్విస్తారా? నవ్విస్తారా? వివాదాస్పద అంశాలను టచ్ చేస్తారా? అనేదానిపై సినీ అభిమానులు, రాజకీయాభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇద్దరూ సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఇద్దరూ రాజకీయాల్లో ఉన్నారు. పవన్ కల్యాణ్ ఏకంగా జనసేన పార్టీని స్థాపిస్తే, హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణ ప్రజా సేవలో ఉన్నారు.

అయితే బాలకృష్ణ ప్రశ్నలు చిలిపిగా మొదలై, చివరికి అవతల వారిని ఇరికించే విధంగా కూడా ఉంటున్నాయి. అంతేకాదు రాజకీయంగా ఏమైనా పవన్ కల్యాణ్ ని అడుగుతారా? దానికి పవన్ ఏ విధంగా బదులిస్తారనే దానిపై పలువురిలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ షో కోసం పవన్ కల్యాణ్ స్టయిలిష్ గా రావడం, అంతేకాదు అందుకు తగినట్టుగానే బాలయ్య డ్రెస్సింగ్ కూడా ఉండటం విశేషం.

మరోవైపు ఈ టాక్ షోకు హీరో సాయితేజ్ రానున్నారని తెలిసింది. తనకి ప్రమాదం జరిగిన తర్వాత అడపాదడపా కనిపించినా, ఇంత పెద్ద ఈవెంట్ లో మళ్లీ తను ప్రజల ముందుకు రావడం, కెరీర్ రీ స్టార్ట్ చేయడానికి మంచి వేదిక కావచ్చుననే భావనలు వ్యక్తమవుతున్నాయి.

అన్నపూర్ణా స్టూడియోలో వేసిన భారీ సెట్టింగులో ఇద్దరు యోధులైన హీరోలు కలవబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ముందుగానే రికార్డింగ్ అవుతుంది కాబట్టి, ఒకవేళ ఏమైనా వివాదస్పదం వచ్చినా ఎడిటింగ్ లో తీసి, టెలికాస్ట్ చేసే అవకాశాలున్నాయి. అందువల్ల లోపల ఏం జరిగిందో బయటవారెవరికీ తెలిసే అవకాశమైతే లేదు.

కానీ బాలకృష్ణ మాత్రం చంద్రబాబునాయుడిని కూడా ఇరికించి మాట్లాడించి, తను అనుకున్నది రాబట్టారనే అంతా అన్నారు. అయితే చంద్రబాబు కూడా అదే స్పిరిట్ తో మాట్లాడారని కితాబు కూడా అందుకున్నారు. బహుశా అదే స్టయిల్ లో పవన్ కల్యాణ్ ది సాగవచ్చునని అంటున్నారు.

Leave a Reply