కొంపలు అంటుకుపోతుంటే…తాపీగా చైనా ప్రభుత్వం
చైనా : చైనాలో 25 కోట్ల మందికి మహమ్మారి చేరిందా? అంటే అవుననే అంటున్నారు…ఒక్క డిసెంబర్ నెలలోనే ఇంతమందికి వ్యాపించిందని తెలిసి సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా చైనా ఆరోగ్య కమీషన్ నుంచి ఈ నంబర్ లీక్ కావడంతో మహమ్మారితో మరణించిన వారి సంఖ్యపై కచ్చితమైన వివరాలు ప్రపంచానికి చెప్పాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ) సూచించింది.
అయితే శ్మశాన వాటికల వద్ద గంటల కొద్దీ బంధువుల శవాలతో క్యూల్లో నిలిచి ఉన్న చైనా ప్రజల ఫొటోలను అక్కడ ఒక ఆర్యోగ్యాధికారి ఆన్ లైన్ లో ఉంచారు. దీంతో ఒక్కసారిగా ఈ ఫొటోలు వైరల్ అయిపోయాయి. అయితే బీఎఫ్-7 వేరియంట్… ప్రపంచంలోనే అతిపెద్ద ముప్పుగా అభివర్ణిస్తున్నారు.
24 గంటలు శ్మశాన వాటికల్లో శవాలను దహనం చేస్తున్నా, సంఖ్యరోజురోజుకి పెరిగిపోతోందని అంటున్నారు. ఇక రాత్రిళ్లు చలిలో ఆ మృతదేహాలను పక్కన పెట్టుకుని బంధువులు నిలిచి ఉండటం చూస్తుంటే అందరి మనసులు బరువెక్కిపోతున్నాయని, వారి రోదనలతో ఆ ప్రాంతమంతా నిండిపోతోందని అంటున్నారు.
చైనాలోని అన్ని పట్టణాల్లోని ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడు తున్నాయి. ఆక్సిజన్ సిలిండర్లు లేక కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు చేతులెత్తేశాయి. చాలామందికి అంబులెన్సుల్లో, మరికొన్ని చోట్ల ఆసుపత్రి ఆవరణల్లో చికిత్స అందిస్తున్నారు. బంధువులను పట్టుకొని వందల కిలోమీటర్లు కొందరు ప్రయాణిస్తున్నారు. కొందరిని వీల్ చైర్లలో తీసుకువెళుతూ ఎలాగైనా వైద్యం చేయమని ప్రాధేయపడుతున్నారు. ఈ క్రమంలో ఆ మహమ్మారి సోకకుండా డ్రెస్ వేసుకుని, గాలి ఆడక రోగులను తీసుకువెళ్లే వాళ్లు పలు అవస్థలు పడుతున్నారు. అంతేకాకుండా సమయానికి తిండి, నీళ్లు లేక అలమటిస్తున్నారు.
ఇంత జరుగుతున్నా చైనా మాత్రం ఈ మహమ్మారిపై కిమ్మనడం లేదు. ఇప్పటికి ఏడుగురు మాత్రమే మరణించారని చెప్పడం చూస్తుంటే, ప్రపంచం ఏమైనా అజ్నానంలో ఉందా? అనేది అర్థం కావడం లేదని మేధావులు వ్యాక్యానిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చైనా ఆటలాడుతోందా? అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఉన్నట్టుండి ఉన్న నిబంధనలు కూడా సడలించడం చూస్తుంటే, వీళ్లేదో ప్రపంచానికి ముప్పు తేవడానికే కంకణం కట్టుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.