జాతీయ వార్తలు

భారత్‌జోడో యాత్రకు కరోనా ఎఫెక్ట్‌.! తాత్కాలికంగా నిలిపేయాలని కేంద్రం సూచన

న్యూఢిల్లీ : భారత జోడో యాత్రపై కరోనా ప్రభావం పడింది. కరోనా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీతో పాటు రాజస్థాన్​ సీఎం అశోక్​ గెహ్లాట్‌కు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్​ సుఖ్​ మాండవీయ తాజాగా లేఖ రాశారు. వ్యాక్సిన్​ తీసుకున్న వ్యక్తులే భారత్​ జోడో యాత్రలో పాల్గొనాలని సూచించారు. యాత్రలో పాల్గొనే వాళ్లంతా మాస్క్​లు ధరించేలా, శానిటైజర్లు వాడేలా పర్యవేక్షించాలన్నారు. కొవిడ్​ కట్టడికి సంబంధించిన నిబంధనలను అమలు చేయాలని కోరారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే.. అత్యవసర ప్రజారోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతానికి యాత్రను ఆపేయాలని స్పష్టం చేశారు.

జపాన్, అమెరికా, చైనా, బ్రెజిల్, దక్షిణ కొరియా దేశాల్లో మళ్లీ కరోనా విజృంభిస్తోందనే వార్తల నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకూ కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ రాసింది. కొవిడ్​ ముప్పు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా.. రాహుల్​ గాంధీకి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి లేఖ రాయడంపై కాంగ్రెస్​ నేత అధిర్​ రంజన్​ చౌదరి స్పందించారు. బహుశా రాహుల్​ గాంధీ పాదయాత్ర చేయడం ఆరోగ్యశాఖ మంత్రి మన్​ సుఖ్​ మాండవీయకు నచ్చడం లేదనుకుంటా అని వ్యాఖ్యానించారు. యాత్రపై నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

Leave a Reply