తెలంగాణ

వారాహి’ రిజిస్ట్రేషన్‌ నెంబరు TS13 EX 8384

హైదరాబాద్‌ : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం కోసం సిద్ధం చేసుకున్న ‘వారాహి’ వాహనం రిజిస్ట్రేషన్‌కు క్లియరెన్స్ లభించింది. ఈ వాహనం రంగుపై ఏపీలో అధికారపక్ష నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మిలిటరీ వాహనాలకు వేసే ఆలివ్‌గ్రీన్ రంగును ప్రైవేటు వాహనాలకు ఎలా వేస్తారంటూ వైసీపీ నేతలు ప్రశ్నించారు. అయితే అన్ని అడ్డంకుల్ని అధిగమించి వారాహి.. తెలంగాణలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుంది. వారాహి వాహనానికి రవాణా శాఖకు సంబంధించిన అన్ని అనుమతులు ఉన్నాయని తెలంగాణ ట్రాన్స్ పోర్ట్ అధికారులు స్పష్టం చేశారు. వారం రోజుల క్రితమే వారాహి వాహనం రిజిస్ట్రేషన్ పూర్తయిందని తెలిపారు. వాహనం బాడీ కలర్‌ (ఎమరాల్డ్‌ గ్రీన్‌)కి సంబంధించిన సర్టిఫికెట్‌ను పరిశీలించామని చెప్పారు. వారాహి వాహనానికి తెలంగాణ రవాణా శాఖ TS 13 EX 8384 నెంబరు కేటాయించింది.

ఎన్నికల ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ సిద్దం చేసుకున్న వారాహి వాహనాన్ని ముందే వివాదాలు చుట్టుముట్టాయి. ముఖ్యంగా ప్రత్యర్ధులకు ఈర్ష్య కలిగేంచేలా పవన్ ఈ భారీ వాహనాన్ని తయారు చేయించుకున్నారు. సీఎం వాడే వాహనాల కంటే భారీగా, దుర్భేద్యంగా రూపొందించిన ఈ వాహనంపై అధికార వైసీపీ విమర్శలకు దిగింది. దాని రంగు ఆర్మీ వాహనాల రంగును పోలి ఉందని, నిబంధనల ప్రకారం ఈ వాహనం రోడ్లపైకి వచ్చేందుకు వీల్లేదని, దీనికి రిజిస్ట్రేషన్ కూడా జరగదని ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో, వారాహి వాహనానికి తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్‌ విభాగం నుంచి క్లియరెన్స్ లభించింది.

Leave a Reply