తెలంగాణ

డ్రగ్స్ కలకలం: జాబితాలో కొత్త సినీ తార్ల పేర్లు?

హైదరాబాద్ : హైదరాబాద్ లో మళ్లీ డ్రగ్ రాకెట్ ఒకటి బయటపడింది. అందులో కీలక సూత్రధారి హైదరాబాద్ డీజే మోహిత్ అగర్వాల్ అలియాస్ మైరాన్ మోహిత్ దొరకడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు అతనితో పాటు మరికొందరిని పట్టుకుని, వారి సెల్ ఫోన్లను టచ్ చేస్తే మొబైల్ ఫోన్లలో 8వేల పైనే నంబర్లు ఉన్నాయని అనధికారిక పోలీసుల సమాచారం. ఈ నంబర్లలో ఎక్కువ సినీతారలవే ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతానికి 400 మందికి 41ఏ, సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. పనిలో పనిగా సినీ తారలని కూడా రప్పిస్తారని అంటున్నారు.

గోవా డ్రగ్ కింగ్ పిన్ ఎడ్విన్ న్యూన్స్ నుంచి తాజాగా అరెస్టయిన డీజే మోహిత్ అగర్వాల్ వరకు చాలామంది హోటళ్లలో సర్వర్లుగానే కెరీర్లు ప్రారంభించడం విశేషం. మొదట్లో ఏజెంట్లుగా మారారు. క్రమంగా డ్రగ్ మాఫియాతో సంబంధాలు పెంచుకుని మత్తు సామ్రాజ్యాన్ని స్థాపించి అలా అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోయారు.

అంతేకాదు గోవా, ముంబాయి తదితర నగరాల్లో కోట్ల ఆస్తులున్నాయి. చాలామంది సినిమావాళ్లకి పెట్టుబడులు కూడా పెడుతున్నారు.అలా వెళ్లి సినిమా తారలతో సంబంధాలు పెట్టుకుని, వారికి డ్రగ్స్ సప్లయి చేస్తూ, వారి ద్వారా మరొకరికి అందజేస్తూ ఈ ఉచ్చులోకి వారిని లాగుతున్నారు. దీంతో వారు కూడా ప్రొడ్యూసరే కదా…అనుకుని ధైర్యంగా తీసుకుంటున్నారని కొందరు వ్యాక్యానిస్తున్నారు.

ఈ నెట్ వర్క్ లో ఎడ్విన్ న్యూన్స్ ప్రధాన స్మగ్లర్ గా చెబుతున్నారు. ఇతనికి తమిళనాడులో బాలమురుగన్ నమ్మకమైన మనిషిగా ఉన్నాడని, అతని ద్వారా తమిళనాడులోని ప్రముఖులకు డ్రగ్స్ అందజేసేవాడని ఒక పోలీసాధికారి తెలిపాడు. తను హిమాచల్ ప్రదేశ్ ను అడ్డాగా మార్చుకుని అక్కడ నుంచి రాజస్తాన్, మహారాష్ట్ర, హైదరాబాద్ లోని ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా చేసేవాడని తెలిపాడు.

తాజాగా దొరికిన డ్రగ్ డాన్ మోహిత్ అగర్వాల్ మొదట్లో కవాడీగూడలో ఉండేవాడు. పబ్ లో సర్వర్ గా చేరి డ్రగ్స్ కోసం గోవా వెళ్లినప్పుడు ఎడ్విన్ తో ఏర్పడిన పరిచయంతో తను ఒక డ్రగ్ డాన్ గా ఎదిగాడు. బాలీవుడ్ నటి నేహా దేశ్ పాండేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈవెంట్ మేనేజ్ మెంట్ ప్రారంభించాడు. అంతర్జాతీయంగా పేరు గడించిన ఎంతోమంది డీజేలను తీసుకువచ్చి పబ్ ల్లో ప్రదర్శనలు ఇప్పించే స్థాయికి ఎదిగిపోయాడు.

ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్, హైదరాబాద్ నార్కోటిక్స్ (హెచ్ న్యూ) ఏర్పాటయ్యాక నగరంలో మాదక ద్రవ్యాల రవాణా, వినియోగిస్తున్నవారు వీరందరిపై నిఘా పెరిగింది. గోవా కేంద్రంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అక్కడ డ్రగ్ స్మగ్లర్లతో సంబంధాలు ఉన్న 18 మందిని గుర్తించారు.

వీరిలో బాలమురుగన్, హేమంత్ అగర్వాల్, వికాస్ నాయక్, సంజ గోవెకర్, జాన్ స్టీఫెన్ డిసౌజ, రమేష్ చౌహాన్, ఎడ్విన్ న్యూన్స్, తుకారం, ప్రీతీష్ నారాయణ్ బోర్కర్ వంటి డ్రగ్ కింగ్ పిన్ లను అరెస్ట్ చేశారు. ఇప్పుడు అందరిలో సినిమాతారలు ఎంతమందికి నోటీసులు వెళ్లాయి. ఎంతమంది మళ్లీ ఈడీ ముందుకి వస్తారనేదానిపై ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి.

Leave a Reply