తెలంగాణ

మూడోరోజూ ఐటీ దాడులు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లలో సోదాలు..

న్యూస్ వన్ టీవీ, వెబ్ డెస్క్: తెలంగాణలో మూడో రోజూ ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు కొనసాగుతున్నాయి. హోటల్‌ ఎట్‌ హోమ్‌, వైష్ణవి గ్రూప్‌ స్థిరాస్తి సంస్థ వాటి అనుబంధ సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆయా సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్లు, సీఈవోలు, డైరెక్టర్ల ఇళ్లలోనూ క్షణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.

మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి ఇళ్లలోనూ ఐటీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. పన్ను చెల్లింపులకు సంబంధించిన పత్రాలను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ లో చేపట్టిన సోదాల్లో 70 ఐటీ బృందాలు పాల్గొన్నాయి.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా జరుగుతున్న ఐటీ శాఖ దాడులు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. రెండోరోజు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి నివాసాల్లో ఐటీ అధికారుల సోదాలు చేశారు. మైలాన్ డిజిటల్ టెక్నాలజీలో కొత్త ప్రభాకర్ రెడ్డి, మర్రి జనార్థన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి భాగస్వాములుగా ఉన్నట్లు ఐటీ అధికారులు నిర్ధారించారు.

ముగ్గురు నేతలు కలిసి పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారని గుర్తించారు. నేతల సతీమణులు, కుటుంబ సభ్యులు డైరెక్టర్స్‌గా ఉన్న కంపెనీలపై దృష్టిపెట్టారు. బ్యాంకు లాకర్స్‌ను సైతం ఓపెన్ చేసిన ఐటీ అధికారులు పలు కీలక పత్రాలు, సమాచారం సేకరించారు.

Leave a Reply