అల్పపీడనంగా మారిన వాయుగుండం -ఏపీకి తప్పిన వానగండం
విశాఖపట్నం : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలహీనపడుతోంది. అందువల్ల ఏపీకి గండం తప్పింది. ప్రస్తుతం దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరం నుంచి ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. ఐతే.. దీని ప్రభావం వల్ల ఇవాళ ఓ మోస్తరుగా, రేపు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షాల ప్రభావం ఎక్కువగా కోస్తా ఆంధ్ర, రాయలసీమపై ఎక్కువగా ఉండనుంది. ఇప్పటికే రాయలసీమలో వానలు కురుస్తున్నాయి. నిన్న నెల్లూరు జిల్లాలో భారీ వర్షం కురిసింది. అటు సముద్రంలో చేపల వేటకు వెళ్లేవారు ఇవాళ వెళ్లకపోవడం మంచిదనీ, సముద్రం అల్లకల్లోలంగా ఉందని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగానే ఉంది. చల్లటి గాలులు వీస్తున్నాయి. ఐతే.. వర్షాల వల్ల వచ్చే నాలుగు రోజులూ చలి కాస్త తగ్గే అవకాశం ఉన్నా.. ఆ తర్వాత మరింత పెరిగే అంచనా ఉంది. డిసెంబర్‌లో చలి మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు. పెద్దవాళ్లు, ఆస్తమా బాధితులు, జలుబు, దగ్గు, జ్వరంతో ఉన్నవారు.. చలికి దూరంగా ఉండాలనీ.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య అధికారులు కోరుతున్నారు. ఇమ్యూనిటీ తక్కువగా ఉండే పిల్లల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.