ఏపీలో ఎవరు ‘కాపు’లర్ నేత?
ఆంధ్రా : ఆంధ్రా రాజకీయాల్లో మళ్లీ ‘కుల’కలం మొదలయింది. మూడున్నరేళ్ల క్రితం మాయమైన కాపు కదనోత్సాహం, ‘విశాఖ ఘటన’ పుణ్యాన మళ్లీ తెరపైకొచ్చింది. సాగర నగరంలో జనసేనాధిపతి పవన్ కల్యాణ్‌పై.. సర్కారీ దాష్టీకం ప్రత్యక్షంగా చూసిన కాపుజాతి ఆవేశం, కట్టలుతెంచుకుంది. ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్వయంగా పవన్ వద్దకు వెళ్లిన ఘటన, కాపు-కమ్మ ఏకీకరణతోపాటు.. కాపుల ఏకీకరణకు దారి తీసింది. గత ఐదేళ్ల తర్వాత ఇదో తొలి అడుగు. పవన్‌పై వైసీపీ చేస్తున్న మాటల దాడిని, టీడీపీ ‘కాపు’ కాసి, వైసీపీపై ఎదురుదాడికి దిగుతోంది. ఆవిధంగా.. జనసేన-టీడీపీ జమిలిగా, జగన్ సర్కారుపై జంగ్ మొదలుపెట్టాయి.
ఫలితంగా అధికార వైసీపీ శిబిరంలో ఆందోళన. ఒక్కసారిగా కాపు మంత్రులు-ఎమ్మెల్యేల మాటల దాడి. చాలాకాలం తర్వాత కాపు నేతగా తెరపైకి మళ్లీ బొత్స రంగప్రవేశం. పవన్-చంద్రబాబు బంధం బ్రేక్ చేసే లక్ష్యంగా అడుగులు. కాపు-కమ్మ బంధం బలపడితే.. పుట్టిమునుగుతుందన్న ఆందోళనతో, మరోసారి వ్యూహాత్మకంగా వంగవీటి రంగా హంతకుల ప్రస్తావన. ‘కమ్మ-కాపు’ బంధానికి బ్రేకులు వేసేందుకు, మరిన్ని మాయోపాయలకు ఊపిరి.
వైసీపీ-జనసేన-టీడీపీ త్రిముఖ రాజకీయ సమరంలో.. హటాత్తుగా ప్రవేశించిన బీజేపీ జాతీయ నేత కన్నా లక్ష్మీనారాయణ, సీఎంపై సంధించిన ‘ కాపులకు ఐదుశాతం రిజర్వేషన్ల’ లేఖతో మరో కలకలం. రిజర్వేషన్లు అమలుచేయించాలన్న కన్నా లేఖ, వైసీపీ కాపు శిబిరంపై అనుకోని పిడుగు. అది వైసీపీ కాపు నేతలకు ప్రాణసంకటం.
ఈ నేపథ్యంలో వైసీపీ-టీడీపీ-జనసేన-బీజేపీలో అసలు సిసలు ‘కాపు’లర్ ఎవరు? కాపులకు నిజమైన హీరో ఎవరు? కాపులు ఏ పార్టీ వైపు అడుగులు వేయనున్నారు? గతానుభవాల దృష్ట్యా, కాపుల ఆవేశం తాత్కాలికమా? శాశ్వతమా? ఇదీ.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర మైన చర్చ.
జనసేనాధిపతి పవన్ కల్యాణ్-టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జమిలి అడుగులు, ఏపీలో నూతన రాజకీయ సమీకరణకు తెరలేపాయి. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో దాదాపు 60 నియోజకవర్గాల్లో, కాపు-బలిజల ప్రభావం ఎక్కువగా ఉండటమే దానికి ఒక కారణం. ఇక 20 నియోజకవర్గాలకు పైగా ,కమ్మ-కాపు ప్రభావం ఉన్న నియోజకవర్గాలుండటం మరో ప్రధాన కారణం. ఆ క్రమంలో ఆ రెండు కులాలు- రెండు పార్టీలు కలిస్తే, తన రాజకీయ భవిష్యత్తేమిటన్న ఆందోళన వైసీపీలో సహజంగానే ప్రారంభమయింది.
గుంటూరు-కృష్ణా-ప్రకాశం-అనంతపురం-చిత్తూరు జిల్లాల్లో దాదాపు 20 నియోజకవర్గాలకు పైగా కమ్మ-కాపు ఉమ్మడి ప్రభావం ఉంది. రాయలసీమలో బలిజల ప్రభావం, ప్రత్యేకించి కొన్ని నియోజకవర్గాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఉభయ గోదావరిలో పూర్తిస్థాయిలో కాపు, కృష్ణా-గుంటూరు-నెల్లూరు జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో కొంతమేరకు కాపు-బలిజ ప్రభావం ఉంది.
ఈ సమీకరణ దృష్ట్యా.. టీడీపీని అభిమానించే కమ్మ సామాజికవర్గం, జనసేనను ఆరాధించే కాపు సామాజికవర్గం కలిస్తే, వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్న అంచనా లేకపోలేదు. అయితే రంగా హత్యానంతరం కాపులు.. టీడీపీని వ్యతిరేకించడం ప్రారంభించారు. దానితో ఆ రెండు కులాల మధ్య విభజన విజయవంతంగా కొనసాగుతోంది.
పవన్ కల్యాణ్ జనసేన స్థాపించిన తర్వాత, ఈ సమీకరణలో కొంత మార్పునకు కారణమయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో.. టీడీపీ-బీజేపీ కలసి పోటీ చేసినప్పుడు, పవన్ ఆ కూటమి విజయం కోసం పనిచేశారు. అప్పుడు కాపులు ఆ కూటమిని ఆదరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కూటమి విడిపోయి.. ఎవరికి వారు సొంతగా పోటీ చేసినప్పుడు, చివరకు పవన్ కూడా రెండుచోట్లా ఓటమిపాలయ్యారు. టీడీపీ 23 సీట్లకే పరిమితం కాగా, బీజేపీకి అసలు ధరావతే దక్కలేదు. జనసేన గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీకి జై కొట్టారు.
తాను కాపులకు రిజర్వేషన్లు ఇవ్వనని వైసీపీ అధినేత జగన్ స్పష్టంగా చెప్పినప్పటికీ, సీఎం అయిన పరిస్థితి. అయినా వైసీపీకి చెందిన 27 మంది కాపులు ఎమ్మెల్యే, ముగ్గురు ఎంపీలయిన వైచిత్రి. దానితో గత ఎన్నికల్లో చివరకు కాపులు కూడా జనసేనకు, దానితోపాటు టీ డీపీకి ఓటు వేయలేదని స్పష్టమయింది. ఈ నేపథ్యంలో గత మూడేళ్లుగా జనసేనాధిపతి పవన్ , వైసీపీ సర్కారు లక్ష్యంగా చేస్తున్న విమర్శలు, చేస్తున్న ప్రకటనలు జగన్ సర్కారుకు ఇరుకున పెడుతున్నాయి. పవన్ లక్ష్యంగా వైసీపీ కాపు మంత్రులు ఆయనపై చేస్తున్న వ్యక్తిగత దాడి, కాపులలో మరింత కసిని పెంచుతున్నాయి.
పైగా చిరంజీవి-ఆయన తనయుడు నటించిన ఆర్‌ఆర్‌ఆర్, ఆచార్య సినిమాకు మినహాయింపు ఇచ్చిన జగన్ సర్కారు, పవన్ నటించిన భీమ్లానాయక్ సినిమాకు మాత్రం ఎలాంటి రాయితీ, మినహాయింపు ఇవ్వలేదు. పవన్‌పై కాపు మంత్రులు చేస్తున్న విమర్శలను చిరంజీవి ఖండించకపోవడం కాపులలో అసంతృప్తికి కారణమయింది. ఈ విధంగా కొణిదెల కుటుంబంలో.. అన్నదమ్ములను వ్యూహాత్మకంగా విడదీయడంలో, జగన్ విజయం సాధించారు.
అయితే ఇది పవన్ అభిమానులు-కాపులలో ఆగ్రహానికి దారితీసింది. కొద్దిరోజుల క్రితం విశాఖ పర్యటనకు వెళ్లిన పవన్‌ను, ప్రభుత్వం వేధించిన దృశ్యాలు కాపుజాతిలో ఆవేశం రగిల్చాయి. ఆ సందర్భంగా జనసేన నేతలను అరెస్టు చేసి జైలుకు పంపడం, పవన్‌ను హోటల్ నుంచి బయటకు రాకుండా, అడ్డుకోవడం వంటి దృశ్యాలు చూసిన కాపులు.. ఈసారి ఎట్టి పరిస్థితిలో జనసేనకు ఓటేయాలన్న కసికి కారణమయ్యాయి.
అప్పటికే తన బలం ఒక్కటే సరిపోదని గ్రహించిన పవన్‌కు, టీడీపీ అధినేత-మాజీ సీఎం చంద్రబాబు తోడవడం, ఏపీ రాజీ యాలను కొత్త మలుపు తిప్పింది. చంద్రబాబు స్వయంగా పవన్ ఉన్న హోటల్‌కు వెళ్లి, ఆయనకు సంఘీభావం ప్రకటించారు. ఇద్దరూ కలసి జగన్ సర్కారుపై కదం తొక్కాలని తీర్మానించడం, అటు రెండు కులాల ఏకీకరణకూ కారణమయింది. అప్పటివరకూ ఎడముఖం-పెడ ముఖంగా ఉన్న కమ్మ-కాపులు.. వారిద్దరి కలయికతో, జగన్‌ను గద్దెదింపేందుకు కలసి పనిచేయాలన్న నిర్ణయానికి రావడం, ఏపీ రాజకీయాల్లో కీలక మలుపుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు పల్నాడు పర్యటనలో టీడీపీ-జనసేన జెండాలు కలసి కనిపించడమే వారి ఏకీకరణకు ఓ నిదర్శనంగా విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
శరవేగంగా మారుతున్న రాజకీయ కుల సమీకరణలతో, వైసీపీ నాయకత్వం అప్రమత్తమయింది. ఫలితంగా రాజమండ్రి వేదికగా.. వైసీపీకి చెందిన కాపు మంత్రులు-ఎమ్మెల్యేల భేటీకి ప్రాణం పోసింది. భేటీకి హాజరయిన వారంతా పవన్‌పై మరోసారి నిప్పులు చెరిగారు. పవన్-చంద్రబాబు కలయికను తప్పుపట్టారు. కాపులకు జగన్ చేస్తున్న సంక్షేమాన్ని ఏకరవుపెట్టారు. వంగవీటి రంగా హంతకులతో ఎలా కలసి పనిచేస్తారంటూ మరోసారి సెంటిమెంట్‌ను తెరపైకి తెచ్చి, పాత గాయాన్ని కొత్తగా గుర్తు చేశారు. మరోసారి బెజవాడలో భేటీ కావాలని నిర్ణయించారు. ఈ క్రమంలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి కాపునేతగా తెరపైకి రావడం విశేషం. అయితే కాపు మంత్రుల దాడితో అప్రమత్తమయిన టీడీపీ.. వారిపై అదే కాపు నేతలతో ఎదురుదాడి చేసి, జనసేనకు దన్నుగా నిలిచింది.
కాపు మంత్రులు-ఎమ్మెల్యేల మాటలు నమ్మే పరిస్థితిలో కాపు జాతిలేదని కాపునాడు అధ్యక్షుడు గాళ్ల సుబ్రమణ్యం వ్యాఖ్యానించారు. కాపులకు బీసీహోదా ఇస్తే ఉరి వేసుకుంటానన్న బొత్స సత్యనారాయణ ఇప్పుడు కాపుల గురించి మాట్లాడమే వింతగా ఉందంటూ ఎద్దేవా చేశారు. రంగా హంతకులు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో.. ఆయన కుటుంబం ఏ పార్టీలో ఉందో కాపు మంత్రులకు తెలియదా? అని ప్రశ్నించారు. రాజకీయ ఉనికి కోసం కాపు మంత్రులు-ఎమ్మెల్యేలు జగన్ సర్కారుకు చేస్తున్న వెట్టి చాకిరీని కాపులు నమ్మరని స్పష్టం చేశారు. విశాఖ ఘటన తర్వాత కాపులలో ఏకీకరణ మొదలయిందన్న మాట వాస్తవమే అన్నారు.
ఈ క్రమంలో హటాత్తుగా రంగప్రవేశం చేసిన బీజేపీ జాతీయ నేత కన్నా లక్ష్మీనారాయణ.. వ్యూహాత్మకంగా కాపులకు గత ప్రభుత్వం ఇచ్చిన 5శాతం రిజర్వేషన్‌ను తెరపైకి, వైసీపీ మంత్రులను ఆత్మరక్షణలోకి నెట్టారు. గత ప్రభుత్వం ఇచ్చిన 5 శాతం రిజర్వేషనుకు చట్టబద్ధత కల్పించాలంటూ.. కన్నా నేరుగా సీఎంకు లేఖ రాయడంతో, కాపు అంశాలపై మాట్లాడుతున్న వైసీపీ మంత్రులను ఇరుకున పెట్టినట్టయింది.
తాజా పరిణామాల నేపథ్యంలో కాపులు.. జనసేనాధిపతి పవన్ వెంట ఉన్నారన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ముద్రగడ పద్మనాభం తెరమరుగయిన క్రమంలో, ఇక పవన్‌ను తమ నేతగా భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో కాపు వర్గానికి చెందిన బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ కూడా.. చాలాకాలం తర్వాత కాపుకార్డు సంధించి, వైసీపీ దూకుడుకు బ్రేకులు వేయడం ఆసక్తికరంగా మారింది. అయితే టీడీపీలో ఆ స్థాయిలో ఇమేజ్ ఉన్న కాపునేతలెవరూ లేకపోవడం.. ఉన్న నేతలంతా జిల్లా స్థాయికే పరిమితం కావడంతో, కాపులు అటు పవన్- ఇటు కన్నా వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.