పవన్ కళ్యాణ్ మాట ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజమైంది: గంటా
విశాఖపట్నం : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై.. మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితాలు.. ప్రభుత్వానికి గుణపాఠం అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చెప్పిన మాటే నిజమైందని స్పష్టం చేశారు.
ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ కేంద్రం వద్దకు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు వచ్చారు. లెక్కింపు సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న పవన్ కళ్యాణ్ మాట ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజమైందన్నారు. చతుర్ముఖ పోటీ కొనసాగినా.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కడ చీలిపోలేదని Ganta Srinivasa Rao వ్యాఖ్యానించారు.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం అని గంటా శ్రీనివాస రావు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు రాష్ట్రం అంతా కనిపించిందని.. రాయలసీమలో కూడా సత్తా చాటుతుండటం టీడీపీ హవాకు సంకేతమని విశ్లేషించారు. మూడేళ్ల క్రితం 50 శాతం పైగా ఓటింగ్ సాధించిన వైసీపీ.. ఇప్పుడు 30 శాతానికి పడిపోయిందని చెప్పారు. ఈ ఒరవడి వచ్చే ఎన్నికలకు నాంది అని.. 2024లో టీడీపీదే విజయమని స్పష్టం చేశారు. రాజధాని సహా.. వైసీపీ చెప్పిన మాటలకు ప్రజల విశ్వాసం లభించలేదన్నారు.