ఆంధ్రప్రదేశ్

పోలవరం ప్రాజెక్టుకు అదనంగా నిధులు.. రూ.12,911 కోట్లు మంజూరు…

న్యూస్ వన్ టీవీ, వెబ్ డెస్క్: పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అదనంగా నిధులు మంజూరు చేసింది. రూ.12,911.15 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ఆర్థికశాఖ ఉత్తర్వులిచ్చింది. కేబినెట్ ముందు కేంద్ర జల్‌శక్తి శాఖ తీర్మానం ప్రతిపాదించింది. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం డైరెక్టర్‌ నిధుల విడుదలపై ఆదేశాలు జారీ చేశారు.

పోలవరం ప్రాజెక్టు డ్యామ్ 45.72 మీటర్ల ఎత్తున నీరు నిల్వచేసేలా నిర్మించాలి. కానీ 41.15 మీటర్ల ఎత్తు వరకు నీరు నిల్వ చేసేందుకు ఎంత ఖర్చవుతుందో.. ఆ మేరకు నిధులు మంజూరు చేసింది. అయితే తొలి దశ కింద ఈ నిధులు ఇస్తున్నామని కానీ మలివిడతలో మళ్లీ నిధులిస్తామని కానీ కేంద్రం పేర్కొనలేదు.

పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తుకు నిర్మించడానికి రూ.10,911.15 కోట్లకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పించింది. అయితే కేంద్ర జల్‌శక్తి శాఖ మరికొన్ని వివరాలు కావాలని కోరింది. దీంతో తాజా లెక్కలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. డయాఫ్రమ్ వాల్‌ మరమ్మతులు, ప్రధాన డ్యామ్ లో పడ్డ అగాధాలు పూడ్చేందుకు అవసరమయ్యే నిధుల అంచనాను కలిపింది. రూ.16,952.07 కోట్లు అవసరమని తేల్చింది. పోలవరం అథారిటీకి, కేంద్ర జల్‌శక్తి శాఖకు ఆ లెక్కల వివరాలు సమర్పించింది.

ఈ లోపే పాత అంచనాల మేరకు రూ.10,911.15 కోట్లను పరిగణనలోకి తీసుకుంది కేంద్రం. దీంతోపాటు పోలవరంలో డయాఫ్రమ్ వాల్‌ మరమ్మతులు, పాక్షిక డయాఫ్రమ్ వాల్‌ నిర్మాణానికి, ప్రధాన డ్యామ్ ప్రాంతంలో ఏర్పడ్డ పెద్ద పెద్ద అగాధాల పూడ్చివేతకు అంచనా వేసిన రూ.2 వేల కోట్లు కూడా కలిపి రూ.12,911.15 కోట్లకు కేంద్ర ఆర్థికశాఖ వ్యయ నియంత్రణ విభాగం ఆమోదించింది. అదనంగా ఇస్తున్న రూ.12,911.15 కోట్లకు ఎలాంటి పరిమితి విధించబోమని కేంద్ర ఆర్థికశాఖ తేల్చిచెప్పింది.

Leave a Reply