అంతర్జాతీయ వార్తలు

డార్క్ వెబ్‌ లైవ్‌లో హత్యలు.. స్నేహితురాలిని చంపిన ఇద్దరు టీనేజర్లు!

న్యూస్ వన్ టీవీ, ఇంగ్లాండ్‌ :- ఒకరిని చంపితే.. చనిపోయే వ్యక్తి చివరి క్షణాల్లో ఎలా తల్లడిల్లుతాడో చూసి పొందే పైశాచిక ఆనందం అనుభవించడానికి.. ఇద్దరు టీనేజర్లు తమ స్నేహితురాలిని ప్లాన్ వేసి ఆమెను 28 సార్లు కత్తితో పొడిచి పొడిచి చంపారు. ఈ ఘటన ఇంగ్లాండ్‌లోని వారింగ్‌టన్ పట్టణంలో జరిగింది.

స్కార్‌లెట్ జెంకిన్‌సన్ (అమ్మాయి- 16), ఎడ్డీ రాట్‌క్లిఫ్ (అబ్బాయి-16) ఇద్దరూ కలిసి తమ స్కూల్ ఫ్రెండ్ అయిన బ్రియాన్నా ఘే(16) అనే అమ్మాయిని గత సంవత్సరం ఫిబ్రవరిలో మృతురాలి ఇంటి సమీపంలోని ఓ పార్క్‌లో హత్య చేశారు. హత్య సమయంలో వీరి వయసు 15 సంవత్సరాలే.

ఈ కేసులో వీరిద్దరిపై కోర్టులో విచారణ చేసే సమయంలో షాకింగ్ నిజాలు తెలిసాయి. మృతురాలు బ్రియాన్నాను టిక్ టాక్‌లో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె వీడియోలను అందరూ ఇష్టపడేవారు. అయితే బ్రియాన్నా ఒక ట్రాన్స్ జెండర్. ఆమె డిప్రెషన్‌తో బాధపడుతూ.. ఇంటి వద్దనే ఉండేది. పెద్దగా ఎవరితో మాట్లాడేది కాదు. బ్రియాన్నాకు స్కూల్ ఫ్రెండ్స్ అయిన స్కార్‌లెట్ ఎక్కువగా బ్రియాన్నా ఇంటి వస్తూ ఉండేది.

స్కార్‌లెట్ జెంకిన్ సన్ (హంతకురాలు)

మరోవైపు స్కార్ లెట్, ఎడ్డీ ఇద్దరికీ నిషేధిత డార్క్‌వెబ్ చూడడం అలవాటు. దీంతో ఇద్దరూ డార్క్‌వెబ్ చూడడానికి ఒక ప్రత్యేక యాప్ డౌన్‌లోప్ చేసుకొని డార్క్‌వెబ్‌లో మనుషులను ఎలా చంపాలి అనే వీడియోలు చూసేవారు. ఈ క్రమంలో డార్క్‌వెబ్‌ లైవ్‌లో మనిషిని చిత్రవధ చేస్తూ హత్య చేయడం ఎలా అని వీడియోలు చూశారు. దీంతో తాము కూడా ఒక హత్య చేయాలనే ఒక సైకో ఆలోచన వారికి కలిగింది. అప్పుడే స్కార్‌లెట్‌కు ఒక ఆలోచన వచ్చింది.

ఆమెకు తన ఫ్రెండ్ బ్రియాన్నా అంటే అసూయ. బ్రియాన్నాకు టిక్‌టాక్‌లో లక్షలమంది ఫాలోవర్స్ ఉండడం చూసి ఓర్చుకోలేకపోయేది. అందుకే బ్రియాన్నాను చంపుదామని.. ఎడ్డీతో చెప్పింది. అందుకు ఎడ్డీ ఒక మిలిటరీ కత్తి తీసుకొచ్చాడు. ముందుగా బ్రియాన్నాని మాయమాటలు చెప్పి.. ఆమె ఇంటి వద్ద ఉన్న పార్క్‌లోకి తీసుకొచ్చింది స్కార్‌లెట్. ఆ తరువాత వెనుక నుంచి వచ్చిన ఎడ్డీ.. బ్రియాన్నాను తలలో కత్తిని దింపాడు. ఆ తరువాత మెడ, వీపు భాగంలో కత్తితో పొడిచాడు. ఆ గాయాలకు బ్రియాన్నా కిందపడి కొట్టుమిట్టాడుతున్న సమయంలో.. ఎడ్డీ భయపడిపోయాడు. ”ఇక చాలు నేనిది చేయలేను..” అని కత్తి కింద పడేశాడు. కానీ స్కార్‌లెట్ అందుకు ఒప్పుకోలేదు.

తాను ఆ కత్తి తీసుకొని.. వరుసగా 25 సార్లు బ్రియాన్నా ఛాతి, కడుపు భాగంలో పొడిచింది. బ్రియాన్నా చనిపోయిన తరువాత ఇద్దరూ అమాయకంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ వెళ్లి పోయే ముందు శవం వద్ద ఫోటోలు తీసుకున్నారు. బ్రియాన్నా ఫోన్లో నుంచి స్కార్‌లెట్ పంపిన మెసేజ్‌లో డెలీట్ చేశారు. ఆ తరువాత కొంత సమయం తీసుకొని.. బ్రియాన్నా ఫోన్‌కి స్కార్‌లెట్ ఒక మెసేజ్ చేసింది. అందులో ”నువ్వెడున్నావ్ డియర్.. నీ కోసం మీ ఇంటి వెయిట్ చేస్తున్నాను” అని మెసేజ్ పంపింది.

బ్రియన్నా హత్య కేసులో పోలీసులు విచారణ మొదలు పెట్టినప్పుడు.. వారు ముందుగా బ్రియాన్నా ఫోన్ చెక్ చేశారు. అందులో చివరి మెసేజ్ స్కార్‌లెట్‌దే ఉంది. స్కార్‌లెట్‌ను పోలీసులు ప్రశ్నించినప్పుడు.. ఆమె చివరగా బ్రియాన్నా ఇంటికి వెళ్లానని.. అప్పటికే బ్రియాన్నా మరొకరితో బయటికి వెళ్లిందని.. తాను హత్య జరిగిన రోజు అసలు ఆమెను కలవలేదని చెప్పింది. హత్య గురించి తెలిసి.. చనిపోయిన బ్రియాన్నా ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో బ్రియాన్నా ఫొటోలు షేర్ చేసి.. ఆమె చనిపోవడం బాధకరమని ట్వీట్ చేశారు. అయితే స్కార్‌లెట్ కూడా సోషల్ మీడియాలో బ్రియాన్నా తనకు బెస్ట్ ఫ్రెండ్ అని ఆమె చనిపోవడం తనకు పెద్ద షాక్ అని రాసింది.

మరోవైపు పోలీసులు హత్య జరిగిన పరిసర ప్రాంతంలో ఉన్న అన్ని సిసిటీవి వీడియోలో పరిశీలించారు. అందులో ఒక వీడియోలో బ్రియాన్నా, స్కార్‌లెట్ ఇద్దరూ కలిసి వెళుతున్నట్లు కనిపించింది. దీంతో పోలీసులు స్కార్‌లెట్‌ని అరెస్టు చేశారు. ఆమెను గట్టిగా ప్రశ్నించగా.. విషయం బయటపడింది. ఈ క్రమంలో పోలీసులు ఎడ్డీని కూడా అరెస్టు చేసి.. కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు విచారణ సమయంలో ఇద్దరూ టీనేజర్లు కావడంతో న్యాయమూర్తి వారి పేర్లను బహిర్గతం చేయకూడదని మీడియాను ఆదేశించారు. విచారణలో ఎడ్డీ ఆటిజం వ్యాధితో బాధపడుతున్నాడని.. తెలిసింది. అందుకే అతను నోరు మెదపలేదు. కానీ స్కార్‌లెట్ హత్య చేసినట్లు అంగీకరించి.. ఎలా హత్య చేసిందో వివరించింది.

ఇదంతా విని కోర్టులో జ్యూరీ సభ్యులు ఆశ్చర్యపోయారు. హత్య చేసినందుకు ఇద్దరినీ కఠినంగా శిక్షించాలని న్యాయమూర్తిని కోరారు. ఈ క్రమంలో న్యాయమూర్తి.. నేర తీవ్రతను బట్టి తాజాగా ఇద్దరు హంతకుల పేర్లు మీడియా బహిర్గతం చేయొచ్చని ఆదేశించారు. ఇద్దరికీ యావజ్జీవ జైలు శిక్ష విధించారు.

ఈ హత్య గురించి చనిపోయిన బ్రియాన్నా తల్లి మాట్లాడుతూ.. ”స్కార్‌లెట్, మా అమ్మాయి ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. స్కార్‌లెట్ మా ఇంటికీ తరచూ వచ్చేది. తాను మా అమ్మాయిని చంపింది అని నేను నమ్మలేకపోతున్నాను. అయినా వారిద్దరూ నేరం చేసి తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. అందుకే వారిని చూస్తే.. నాకు జాలి వేస్తోంది,” అని చెప్పింది. కానీ బ్రియాన్నా తండ్రి మాత్రం వారిద్దరికీ జైలు శిక్ష సరిపోదు, అని చెప్పారు.

డార్క్‌వెబ్‌లో వీడియోలు చూడడం ప్రపంచవ్యాప్తంగా నేరం. అలా చేస్తే.. చట్టపరంగా శిక్ష తప్పదు.

Leave a Reply