జీవో నెంబర్ 111 ఎత్తివేత.. ఎవరికి లాభం..? నష్టాలేంటి..?
న్యూస్ వన్ టీవీ, వెబ్ డెస్క్: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో జంట జలాశయాల పరిరక్షణ కోసం తీసుకొచ్చిన 111 జీవోను తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేసింది. కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. 111 జీవో పరిధిలో నిర్మాణాలు, క్రయవిక్రయాలపై ఉన్న ఆంక్షలను ప్రభుత్వం గతంలో పాక్షికంగా ఎత్తివేసింది. తాజాగా ఈ జీవోను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు సీఎం కేసీఆర్ కేబినెట్ సమావేశంలో ప్రకటించారు. 84 గ్రామాల ప్రజల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
హిమాయత్ సాగర్, గండిపేట జలాశయాలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు కేసీఆర్. రింగ్‌మెయిన్ నిర్మాణంతోపాటు నీరు కలుషితం కాకుండా ఎస్టీపీలను నిర్మిస్తామని తెలిపారు. దీంతోపాటు కాళేశ్వరం నుంచి కొండపోచమ్మ సాగర్ ద్వారా హిమాయత్‌సాగర్, గండిపేటలతోపాటు మూసీ, హుస్సేన్‌సాగర్‌లకు గోదావరి నీటిని అనుసంధానం చేస్తామన్నారు. ఇకపై 111 జీవో పరిధిలోని గ్రామాలకు కూడా హెచ్‌ఎండీఏ నిబంధనలే అమలవుతాయి. ఈ ప్రాంతంలో రహదారులను 200 అడుగులకు విస్తరిస్తారు.
జీవో నెంబర్ 111 పరిధిలో 1,32,600 ఏకరాల భూమి ఉంది. గతంలో జంట జలాశయ పరిరక్షణ కోసం ఈ జీవోను అమల్లోకి తెచ్చారు. చేవెళ్ల, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లోని 84 గ్రామాలు ఈ జీవో పరిధిలో ఉన్నాయి. కొన్ని దశాబ్దాలుగా ఈ గ్రామాల ప్రజలు 111 జీవోను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్ కు నీరందించే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ను కాపాడేందుకు 1996లో అప్పటి ప్రభుత్వం ఈ జీవోను తీసుకువచ్చింది. ఈ ప్రాంతంలో నిర్మాణాలు చేయడంపై నిషేధం విధించింది. వ్యవసాయం తప్ప ఏ రంగానికి ఇక్కడ భూమి కేటాయింపు చేయకూడదని స్పష్టం చేసింది.
తెలుగు రాష్ట్రాల్లోని బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు 111 జీవో పరిధిలో భారీగా పెట్టుబడులు పెట్టారు. తెలంగాణ ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల 111 జీవో పరిధిలో ఉన్న భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. అదే సమయంలో ఉస్మాన్ సాగర్ , హిమాయత్ సాగర్ కాలుష్యం బారిన పడే ప్రమాదం ఉంది. ఈ జీవో రద్దుతో 84 గ్రామాల్లోని ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.