300 KMPH స్పీడ్‌తో బైక్ రైడింగ్.. హెల్మెట్‌తో పాటు తల పగిలి.. యూట్యూబర్ దుర్మరణం..
న్యూస్ వన్ టీవీ, వెబ్ డెస్క్: Bike Accident:- స్పీడ్ థ్రిల్స్.. బట్ కిల్స్. అతనూ అదే చెప్పేవాడు. వేగంగా వాహనం నడపొద్దని తన యూట్యూబ్ ఛానెల్లో డిస్లైమర్ వేసేవాడు. అతను మాత్రం యమ స్పీడ్‌గా బైక్ నడిపేస్తాడు. ప్రొఫెషనల్ బైకర్ మరి. ‘ప్రో రైడర్ 1000’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ రన్ చేసేవాడు. అందులో తాను స్పీడ్‌గా బైక్ నడిపే విజువల్స్ అప్లోడ్ చేసేవాడు.
కానీ, ఎప్పుడూ టైమ్ అతనికే అనుకూలంగా ఉండాలని లేదుగా. స్పీడ్ ప్రతీసారి థ్రిల్ ఇవ్వదు. అది మామూలు వాహనదారులకైనా.. ప్రొఫెషనల్ రైడర్లకైనా. వేగానికి తెలీదుగా అతను ప్రొఫెషనల్ అని. ఏమాత్రం స్పీడ్‌ను కంట్రోల్ చేయకపోయినా.. అదుపు తప్పినా.. అంతే సంగతులు. ఆ బైకర్ పరిస్థితీ అదే అయింది. అతివేగానికి దారుణంగా చనిపోయాడు.
అగస్త్య చౌహాన్. ప్రొఫెషనల్ బైకర్. తన యూట్యూబ్ ఛానల్ వీడియో షూట్ కోసం చాలా స్పీడ్‌గా బైక్ నడిపాడు. స్పీడ్ అంటే ఏ గంటలకు 100 kmph కాదు.. 150 కూడా కాదు.. 200 కూడా కాదు.. 250.. 300 KMPH వేగంతో బైక్‌ను దూకించాడు. స్పోర్ట్స్ కార్స్ వెళ్లే మాగ్జిమమ్ స్పీడ్ అది. అంత స్పీడ్‌తో స్పోర్ట్స్ బైక్ నడపడమంటే మామూలు విషయమా. ఛాలెంజింగ్‌గా ఆ సాహసం చేశాడు అగస్త్య. ఆ స్పీడ్‌ను రికార్డు చేసి.. తన యూట్యూబ్ ఛానెల్లో పోస్టు చేసి.. శభాష్ అనిపించుకోవాలని భావించాడు. కానీ, తాను ఒకటి తలిస్తే.. విధి మరోలా తలరాత రాసింది.
ఆ బైక్ రైడింగే అతని జీవితంలో చివరి ప్రయాణంగా మారింది. గంటలకు 300 కి.మీ. వేగాన్ని అతను కంట్రోల్ చేయలేకపోయాడు. ఎంత ప్రొఫెషనల్ రైడర్ అయినా.. ఆ స్పీడ్‌ను హ్యాండిల్ చేయలేకపోయాడు. బైక్ అదుపు తప్పింది. డివైడర్‌ను ఢీకొట్టింది. తలకున్న హెల్మెట్ ముక్కలైంది. తల కూడా పగిలిపోయింది. స్పాట్లోనే డెత్.
ఢిల్లీలో జరిగే మోటార్‌బైక్ రేసింగులో పార్టిసిపేట్ చేసేందుకు బైక్‌పై ఆగ్రా నుంచి బయలుదేరాడు అగస్త్య. యమునా ఎక్స్‌ప్రెస్ వే పై ZX10R నింజా సూపర్‌బైక్‌పై వెళ్తున్నాడు. బైక్ నడుపుతూనే వీడియో రికార్డ్ చేస్తున్నాడు. కొంచెంకొంచెంగా వేగం పెంచుతూ.. 300 kmph రీచ్ అయ్యాడు. కాసేపటికే.. అవుటాఫ్ కంట్రోల్. డివైడర్ మీదకు దూసుకెళ్లింది బైక్. గాల్లో నాలుగైదు పల్టీలు కొట్టింది. బైక్‌తో పాటు బలంగా తల నేలకు తగిలి.. హెల్మెట్‌తో పాటు తల కూడా పగిలి ముక్కలైంది. అగస్త్య అక్కడికక్కడే చనిపోయాడు. స్పీడ్ కిల్స్.