ఆంధ్రప్రదేశ్

మెరుపులు.. మరకలు!

అమరావతి : అటు పేదలకు సంక్షేమం.. ఇటు ఉద్యోగులకు జీతాలివ్వలేని ఆర్థిక సంక్షోభం.. చేసిన పనులకు బిల్లులివ్వలేని దుస్థితి. అయినా ఆగని సంక్షేమపథం. ఫలానా తేదీకల్లా అందరి సెల్‌ఫోన్లకు, ఒకే సమయంలో ఠంగ్‌ మని సంక్షేమ సందేశాలు. ఫలితంగా మహిళల పెదవులపై చిరునవ్వు. వాలంటీర్లు నేరుగా లబ్ధిదారుల చేతికే ఇస్తున్న పించన్లు. పథకలాలో ఎక్కడా కనిపించని అవినీతి. ఇదంతా ఒకవైపే!

మరోవైపు అందుకు పూర్తి విరుద్ధమైన ముఖచిత్రం. కీలక శాఖల్లో అవినీతి జరుగుతోందంటూ విపక్షాల ఆధారరహిత ఆరోపణాస్ర్తాలు. వాటిపై సర్కారు మౌనం. విమర్శలకు సమధానాలివాల్సిన మంత్రులకు బదులు, సలహాదారులే సర్వాంతర్యామి అయిన వైచిత్రి. తమ వారిని అందలమెక్కించేందుకు , కోట్లాదిరూపాయల ప్రజాధనానికి తూట్లు పెడుతున్నారన్న ఆరోపణలు. సొంత మీడియాను ఆర్ధికంగా బాహుబలిని చేస్తున్నారన్న విమర్శలు.

సొంత కులం వారికే సలహాదారు పదవులిస్తున్నారన్న విమర్శలు. తమ వారి మేళ్ల కోసమే కోర్టు ఫీజులకు కోట్లు ఖర్చు పెడుతున్నారన్న నిందలు. ఎప్పుడూ లేని విధంగా సీఐడీపై అరాచకముద్ర. అకారణంగా డీజీపీ తొలగింపు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల నియామకాల్లో ఇష్టారాజ్యం. ఇవన్నీ రెండో వైపు కనిపించే ముఖచిత్రం. అంటే జగనన్న పాలనపై ఈ ఏడాది మెరుపులు.. మరకలు అన్నమాట.

సంక్షేమంలో జగన్‌ సర్కారు ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. ఇదే బడ్టెట్‌ గత ప్రభుత్వంలో ఉన్నప్పటికీ.. పేదలకు ఈ సంక్షేమ పథకాలు ఎందుకు అమలుచేయలేదన్నది, జగన్‌ ప్రతి సభలోనూ టీడీపీకి సూటిగా వేసే ప్రశ్న. జగన్‌ సర్కారు విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 22.31 లక్షలమందికి కొత్తగా పించన్లు మంజూరు చేశారు. రాష్ట్రంలో 1,66,919.71 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. తొమ్మిదినెలల్లో 44,286 కోట్ల రూపాయల పెట్టుబడులు సాకారమయింది.

20-21లో దేశంలోనే అత్యధిక వృద్ధి సాధించిన రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించింది. 12.78 శాతం పారిశ్రామికవృద్ధి సాధించిన రాష్ట్రంగా పేరు తెచ్చుకుంది. కేంద్రం విడుదల చేసిన నివేదికల మేరకు స్థిరధరల ఆథారంగా రాష్ర్టాల జీఎస్‌డీల శాతంలో, ఏపీ 11.43 శాతం సాధించింది. ఇంధన మౌలిక సదుపాయాలు-అభివృద్ధికి సంబంధించి ఏపీకి జాతీయ స్థాయిలో 7 అవార్డు దక్కాయి.

ఎస్సీ వర్గాలకు 15,658.02 కోట్లతో, 53,89,459ప్రయోజనాలు చేకూరాయి. మైనారిటీ వర్గాలకు 13,996.90 కోట్ల లబ్ది చేకూరగా, 45,60,522ప్రయోజనాలు చేకూరాయి. కాపు వర్గాలకు 27,470.05 కోట్ల లబ్ది చేకూరగా, 72.02562 ప్రయోజనాలు చేకూరాయి. జగనన్న అమ్మఒడి పథకానికి19617 కోట్లు ఖర్చు చేయగా, 44,48,865 మంది తల్లులు లబ్దిపొందారు.

జగనన్న వసతి దీవెనకు 3349.57 కోట్లు ఖర్చు చేయగా, 18,77,863 మంది విద్యార్ధులు లబ్ధిపొందారు. జగనన్న విద్యాదీవెనకు 9051.57 కోట్లు ఖర్చు చేయగా, 24,74,544మంది తల్లులు లబ్థి పొందారు. విదేశీ విద్యాదీవెనకు 1645 మంది విద్యార్ధులు, వైఎస్సార్‌ రైతుభరోసాకు 52,38,517 మంది రైతులు లబ్ధిపొందారు.

ఇక ఇవికాకుండా వైఎస్సార్‌ వాహనమిత్ర, వైఎస్సార్‌ కంటివెలుగు, పేదలకు ఇళ్ల నిర్మాణం, జగనన్న గోరుముద్ద, వైఎస్సార్‌ సంపూర్ణపోషణ, జగనన్న తోడు, వైఎస్సార్‌ కళ్యాణమస్తు వంటి పథకాలతో లక్షలాదిమంది పేదలు లబ్దిపొందారు. ప్రధానంగా మహిళలు జగన్‌ సర్కారు పథకాలపై సంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇవన్నీ జగన్‌ సర్కారులో కనిపించిన ఈ ఏడాది మెరుపులే.

ఇక అదే జగన్‌ సర్కారుపై.. ఈ ఏడాది కనిపించిన మరకలూ, అంతేస్ధాయిలో ఉండటం విశేషం. ప్రధానంగా నేరదర్యాప్తునకు మాత్రమే పరిమితం కావలసిన సీఐడీ, విపక్షాలను వేధించే సంస్థగా మారిందన్న అప్రతిష్ఠ మూటకట్టుకుంది. ముఖ్యంగా సీఐడీ చీఫ్‌ అంశం పార్లమెంటు వరకూ వెళ్లింది. అర్ధరాత్రి ఇళ్ల తలుపు కొట్టి వారిని వేధించిన సందర్భాలపై, హైకోర్టు నుంచి లెక్కలేనన్ని సార్లు అక్షింతలు వేయించుకుంది. చివరకు డీజీపీ కూడా కోర్టు గడప ఎక్కాల్సిన దుస్థితి. డీజీపీ గౌతం సవాంగ్‌ను అత్యంత అవమానకర పరిస్థితిలో సాగనంపడం విమర్శలకు దారితీసింది.

ప్రభుత్వ పనులకు సంబంధించి కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపు అంశం, ప్రభుత్వాన్ని తీవ్ర అప్రతిష్టకు గురిచేసింది. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలంటూ హైకోర్టు ఆదేశించడంతో, వారికి బిల్లులు చెల్లించాల్సి రావడం సర్కారుకు చెంపదెబ్బగా పరిణమించింది. దానితో కోర్టును ఆశ్రయిస్తే తప్ప, న్యాయం జరగవన్న భావన ప్రజల్లో స్థిరపడిపోయింది.

ఇక అమరావతి అంశంపై కూడా కోర్టులు జగన్‌ సర్కారుకు, వ్యతిరేక తీర్పులే ఇచ్చాయి. జగన్‌ సర్కారు.. తమకు కావలసిన లాయర్లకు లబ్థిచేకూర్చేందుకు కోట్లు ఖర్చు చేస్తున్నా, న్యాయస్థానాల్లో మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పులు వస్తూనే ఉండటం చర్చనీయాంశమయింది. అంటే ఈ అంశంలో అధికారులు, చట్టప్రకారం ఉత్తర్వులివ్వడం లేదన్న సంకేతాలిచ్చింది.

ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలిచ్చే సంప్రదాయం పోయింది. 15 వ తేదీవరకూ జీతాలు, పెన్షన్లు ఇస్తున్న వైనంపై ఉద్యోగులు, పెన్షనర్లలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను, పర్మినెంట్‌ చేస్తామన్న జగన్‌ హామీ ఇప్పటిదాకా నెరవేరలేదు.

ఇవన్నీ.. కొద్దికాలం వరకూ జగన్‌ అనుకూల వైఖరి ప్రదర్శించిన ఉద్యోగ సంఘాలు, ఈ పరిణామాలతో సర్కారు వ్యతిరేకవైఖరి అనుసరించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మూడున్నర లక్షల ఉద్యోగాలిస్తామన్న హామీ కూడా నెరవేరకపోవడంపై, నిరుద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. వాలంటీర్లకు 5 వేలు, ప్రభుత్వ మద్యం షాపులు, మటన్‌షాపుల్లో ఉద్యోగాలపై వ్యంగ్యాస్ర్తాలు వెల్లువెత్తుతున్నాయి.

డ్రైవర్‌ హత్య కేసులో, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు జైలుపాలవడం వైసీపీని అప్రతిష్ఠపాలుచేసింది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను, తెలంగాణకు మార్చుతూ సుప్రీంకోర్టు తీర్పు, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి మించి 20 వేల కోట్లు అప్పు చేయడం వంటి అంశాలు, ప్రభుత్వాన్ని విమర్శలకు గురిచేశాయి. జగన్‌ సర్కారు చేసిన అప్పులపై చివరకు పార్లమెంటులో కూడా చర్చ జరగడం విశేషం. తరచూ అప్పులు చేస్తున్న వైనాన్ని విపక్షాలు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తుండటంతో, ‘ఇది అప్పుల సర్కారు’ అన్న భావన బలపడింది.

ఏపీలోని రోడ అధ్వాన పరిస్థితిపై విమర్శలు ఇంకా వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ప్రధానంగా సీఎం జగన్‌ పర్యటనల సందర్భంగా, పరదాలు కట్టి ప్రజలను ఇబ్బందులు పెడుతున్న వైనం, జనక్షేత్రంలో విమర్శలకు గురవుతోంది. ఇక 7 సార్లు విద్యుత్‌ చార్జీ పెంచి 16 వేల కోట్లు ఆర్టీసీ చార్జీలు పెంచి 2000కోట్లు, యూజర్‌ చార్జీల పెంపుతో 2400 కోట్లు, భూముల రిజిస్ట్రేషన్‌ పెంపు పేరుతో 800 కోట్లు, మున్సిపాలిటీల్లో చెత్తపన్ను వేసి 120 రూపాయలు వసూలు చేస్తుండటం ప్రజల్లో వ్యతిరేకత పెంచింది.

ఇక రాజకీయంగా టీడీపీ ఈ ఏడాది పుంజుకున్నట్లే కనిపించింది. ‘రాష్ర్టానికి ఇదేం ఖర్మ’ పేరుతో ఏడాది చివరలో చంద్రబాబు నిర్వహిస్తున్న రోడ్‌షో, సభలకు జనం పోటెత్తుతున్నారు. గత కొంతకాలం క్రిత ం వరకూ రాజకీయాలకు పనికిరారన్న భావనలో ఉన్న లోకేష్‌, ఈ ఏడాది తన పనితీరుతో తనపై పడ్డ ముద్రను పూర్తిగా తొలగించుకున్నారు. తరచూ జనంలోకి వెళ్లడం, జగన్‌ సర్కారుపై పదునైన విమర్శలు చేయడం, బాధిత కార్యకర్తలకు భరోసా ఇవ్వడం ద్వారా, తన విమర్శకులకు సరైన సమాధానం ఇచ్చారు.

ఇది ఆ పార్టీ శ్రేణులకు జోష్‌ నింపేదే. అయితే కందుకూరులో 8 మంది మృతి చెందటం విషాదం నింపింది. గత ఏడాది నిరుత్సాహంతో ఉన్న టీడీపీకి.. ఆ పార్టీ కార్యాలయంపై దాడి ద్వారా ఊపిరిపోసిన వైసీపీ, ఈ ఏడాది కూడా అగ్రనేతలపై పోలీసుల వేధింపులతో, టీడీపీ బలోపేతానికి బాటలు వేసింది.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను విశాఖలో, పోలీసులు నిర్బంధించిన వైనం సామాన్యుల విమర్శలకు గురయింది. ఆ పరిణామం టీడీపీ-జనసేన పొత్తుకు బీజం వేసింది. పవన్‌ బస చేసిన హోటల్‌కు చంద్రబాబు స్వయంగా వెళ్లడం రాజకీయాల్లో కొత్త సమీకరణలకు తెరలేచినట్టయింది. పవన్‌ సభలకు జగన్‌ ప్రభుత్వం ఆటంకం కలిగిస్తోందన్న భావన జనక్షేత్రంలో బలపడింది.

ఇప్పటివరకూ పార్టీని పెద్దగా పట్టించుకోని సీఎం, వైసీపీ అధినేత జగన్‌.. ఈ ఏడాది నుంచి పార్టీపై సీరియస్‌గా దృష్టి సారించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలతో భేటీలు వేసి,‘ వైనాట్‌ 175’అన్న నినాదం ప్రారంభించారు. పార్టీపై ఉన్న రెడ్డిముద్ర చెరిపివేసేందుకు, జిల్లా సమన్వయకర్తల్లో బీసీ, ఎస్సీలను నియమించారు. కానీ, తరచూ ప్రకటించే సలహాదారుల పదవులకు.. మళ్లీ అదే రెడ్డి కులానికి చెందిన వారినే నియమించడం వల్ల, ఆ విమర్శలకు తెరపడలేదు.

అవినీతి ఆరోపణలతో అతలాకుతలం

ఇదంతా ఒక కోణమయితే.. కీలక అంశాలపై అవినీతి జరిగిందంటూ, విపక్షాలు చేసిన ఆరోపణలు జనక్షేత్రంలో చర్చనీయాంశమయ్యాయి. 31 వేల మద్యం మాఫియా, 41,500 కోట్లు విశాఖలో భూ కంభకోణాలు, 15 వేల కోట్ల సిమెంట్‌ మాఫియా, 20 వేల కోట్ల ఇసుక మాఫియా, 25 వేల కోఒట్ల మైనింగ్‌ మాఫియా, 21 వేల డ్రగ్స్‌ మాఫియా, 10 వేల కోట్ల గంజాయి మాఫియా25 వేల కోట్ల ఎర్రచందనం మాఫియా, 7 వేల కోట్ల రేషన్‌బియ్యం మాఫియా, 7 వేల కోట్ల సెంటు పట్టా కుంభకోణం, 25 వేల కోట్ల ల్యాండ్‌ మాఫియా, ప్రభుత్వ కార్యాలయాలకు 3,500 కోట్లు, 4 వేల కోట్లు మోటార్లకు మీటర్లు, 15 వేల కోట్ల లేపాక్షి భూముల స్కాం, 3 వేల కోట్లు డైరీ ఆస్తులు అమూల్‌కి, 15వందల కోట్ల సంకల్పసిద్ధి స్కాం, 10 వేల కోట్ల మేరకు అరబిందోకు కాకినాడ సెజ్‌-గేట్‌వే పోర్టులు, వెయ్యి కోట్ల రేషన్‌వాహనాలు, అంబులెన్స్‌ల కుంభకోణం, వెయ్యి కోట్లు సచివాలయాల్లో సాక్షిపత్రిక, ప్రభుత్వ ప్రకటనలు, 65 వేల కోట్ల బినామీలకు గ్రీన్‌ఎనర్జీ ప్రాజెక్టులు, 500 కోట్లు చంద్రశేఖర్‌రెడ్డి జయలక్ష్మి కో ఆపరేటివ్‌ బ్యాంకు కుంభకోణం, 500 కోట్లకు గుడివాడలో కాసినో, 15 వేల కోట్ల విశాఖ బాక్సైట్‌ కుంభకోణం, 200 కోట్ల గుడ్లు-చిక్కీ కుంభకోణం, 100 కోట్ల రూపాయల ఫీజు రీ అంబర్స్‌మెంట్‌ కుంభకోణం, 200 కోట్ల విద్యాకానుకల కుంభకోణం, 670 కోట్ల కరోనా కిట్ల కుంభకోణం, 70 కోట్ల బ్లీచింగ్‌ కుంభకోణం, 30 కోట్లు పేషెంట్లకు భోజనాల కుంభకోణం, 230 కోట్ల రెమ్డిసివర్‌ కుంభకోణం.. మొత్తం 3,35,500 కోట్ల కుంభకోణం జరిగిందంటూ, ప్రదాన ప్రతిపక్షమైన టీడీపీ చేసిన అవినీతి ఆరోపణలు సంచలనం సృష్టించాయి. వీటికి సంబంధిత మంత్రులెవరూ స్పందించకపోవడం మరో విశేషం.

ఇలా ఈ ఏడాది ఏపీని రాజకీయంగా హీటెక్కించాయి. గత ఏడాది వరకూ నిరుత్సాహంగా ఉన్న టీడీపీ, జనసేన ఈ ఏడాదిలో జూలు విదిలించి, జనక్షేత్రంలో దూసుకుపోవడం ప్రారంభించాయి. అధికార వైసీపీలో సీనియర్‌ ఎమ్మెల్యేలు అసమ్మతి స్వరం వినిపించడంతో ఈ ఏడాదికి వీడ్కోలు పలికినట్టయింది.

Leave a Reply