తెలంగాణ

బీబీనగర్ వద్ద పట్టాలు తప్పిన ‘గోదావరి’ ఎక్స్ ప్రెస్

సికింద్రాబాద్ : గోదావరి ఎక్స్ ప్రెస్ నెమ్మదిగా వెళుతోంది. ఉన్నట్టుండి భారీ కుదుపు…ఒక్కసారి రైలు ఒక్కపక్కకి ఒరిగిపోయింది. అంతే ప్రయాణీకులందరిలో హాహాకారాలు… రైలు పెద్దశబ్దం చేసుకుంటూ పట్టాల మీద రాళ్లపై ఆగిపోయింది.

అదృష్టవశాత్తూ ప్రయాణీకులెవరికీ గాయాలు కాలేదు. ఆ రైలు పెట్టెలు పూర్తిగా ఒరిగిపోయి కిందకి దొర్లిపోయి ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేదని అంటున్నారు. ప్రయాణీకులందరూ కంగారుపడి కిందకి దిగిపోయారు.

విశాఖ పట్నం నుంచి సికింద్రాబాద్ వైపు వెళుతున్న గోదావరి (12 727) ఎక్స్ ప్రెస్ బీబీనగర్ వద్ద పట్టాలు తప్పింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయ్యింది. అయితే రైలు తక్కువ స్పీడుతో వెళ్లడం వల్ల పెను ప్రమాదం తప్పింది. దీంతో కాజీపేట లైనులో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైల్వే సిబ్బంది యుద్ధప్రాతిపదిక మీద ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు.

విశాఖపట్నంలో ప్రతిరోజు సాయంత్రం 5.20 గంటలకు గోదావరి ఎక్స్ ప్రెస్ బయలుదేరుతుంది. తెల్లవారుజామున 5.15 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. అనంతరం నాంపల్లి స్టేషన్ కు వెళుతుంది. దక్షిణ మధ్య రైల్వేలో అత్యంత డిమాండ్ ఉన్న ఎక్స్ ప్రెస్సుల్లో గోదావరి ఎక్స్ ప్రెస్ కూడా ఒకటని చెప్పవచ్చు. నిత్యం వేలాదిమంది ప్రయాణాలు చేస్తుంటారు. ఇందులో టికెట్ దొరకడమంటే ఒక అదృష్టంగానే అందరూ చెబుతుంటారు.

అలాంటి ట్రైన్ ప్రమాదం అనగానే ప్రయాణికులతో పాటు, వారి బంధువులు, స్నేహితులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రైల్వే స్టేషన్లకు కొందరు పరుగులు తీస్తే, ఎంక్వైరీకి ఫోన్లు చేసి ఆందోళన చెందినవారు కొందరున్నారు. ఎవరికీ ప్రమాదం జరగలేదని తెలిసి అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Leave a Reply