శాన్ ఫ్రాన్సిస్కో ప్రయాణికుల కోసం రష్యా బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం
న్యూస్ వన్ టీవీ, వెబ్ డెస్క్: ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్లాల్సిన విమానం సాంకేతిక లోపంతో అత్యవసరంగా రష్యాలో దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రష్యాలో ఉన్న ప్రయాణికుల కోసం కేంద్ర ప్రభుత్వం సత్వర చర్యలు ప్రారంభించింది. ప్రయాణికులను శాన్ ఫ్రాన్సిస్కోకి తరలించేందుకు ముంబై నుంచి మరొక విమానాన్ని పంపింది ఎయిర్ ఇండియా సంస్థ.
శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఇంజిన్లలో ఒక దానిలో సమస్య తలెత్తడంతో దానిని అత్యవసరంగా రష్యాలోని మగదాన్ నగరంలో దించారు. మంగళవారం దిల్లీ నుంచి 216 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బందితో బయలుదేరిన ఏఐ-173 విమానం ఇంజిన్‌లో సమస్య తలెత్తిందని ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో ఆ విమానాన్ని రష్యాలో సురక్షితంగా ల్యాండ్ చేశామని, ప్రయాణికులు అందరూ క్షేమంగా ఉన్నారని వెల్లడించింది.
అయితే విమానంలోని ప్రయాణికులు మగదాన్ లోనే రాత్రంతా గడిపారు. అయితే అక్కడ జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా తెలిపారు. ఎయిర్‌లైన్స్ సంస్థతో సంప్రదింపులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విమానంలో దాదాపు ఆరుగంటల పాటు కూర్చున్న ప్రయాణికులు ఆ తర్వాత ఓ హోటల్ గదిలోకి వెళ్లారు. మాస్కోకు దాదాపు 10వేల కిలోమీటర్ల దూరంలో మగదాన్ పట్టణం ఉంది. అయితే హోటల్స్ సరిపోను లేని కారణంగా ప్రయాణికుల్ని డార్మిటరీల్లో ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రస్తుత పరిస్థితి తాము గమనిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. విమానంలో అమెరికా పౌరులు ఉండే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు, విమానంలో ఏర్పడిన సాంకేతిక సమస్యను తాము తనిఖీ చేస్తున్నట్లు రష్యా అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికులను తరలించడం కోసం మరో విమానాన్ని పంపించేందుకు భారత్‌కు అనుమతినిచ్చినట్లు రష్యా విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది.