ఉగ్రవాద సంస్థలే టార్గెట్.. పాకిస్తాన్‌పై మిసైల్ దాడి చేసిన ఇరాన్!
న్యూస్ వన్ టీవీ, ఇరాన్ :- రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ లాంటి రెండు పెద్ద యుద్దాలు ప్రపంచంలో జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆసియా ఖండంలో రెండు ఇస్లామిక్ దేశాల మధ్య కొత్త టెన్షన్ మొదలైంది. ఇరాన్‌కు సంబంధించిన రెవల్యూషనరీ గార్డ్స్ సైన్యం పాకిస్తాన్ భూభాగంపై రెండు క్షిపణి దాడులు చేసింది.
పాకిస్తాన్లో బలూచిస్తాన్ రాష్ట్రం పంజ్‌గుర్ పట్టణంలో మంగళవారం రాత్రి రెండు ఇరాన్ మిసైల్ దాడులు జరిగాయి. భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ఇరాన్ యాత్ర నుంచి తిరిగి వచ్చిన సమయంలోనే ఈ దాడులు జరగడం గమనార్హం.
ఇరాన్ నుంచి ఏ అధికారిక ప్రకటన ఇంతవరకు రాలేదు.. కానీ ఇరాన్‌కు చెందిన తస్నీమ్ న్యూస్ ఈ దాడుల తరువాత జరిగిన దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలు దాడి జరిగిన ప్రదేశంలో స్థానికులు చిత్రీకరించారని తెలిపింది. ఇరాన్ అధికారిక ఇంగ్లీష్ మీడియా ప్రెస్ టీవీ ప్రకారం.. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో ఉగ్రవాద సంస్థ జైష్ అల్ అదల్(ARMY OF JUSTICE) స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ మిసైల్ దాడులు చేసింది.ఈ దాడుల్లో జైష్ అల్ అదల్‌కు చెందిన మూడు స్థావరాలు ధ్వంసమయ్యాయి.
ఈ జైష్ అల్ అదల్ ఉగ్రవాద సంస్థను ఇరాన్ ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ చేసింది. ఇరాన్లో ఈ ఉగ్రవాద సంస్థ గత కొన్ని సంవత్సరాలలో పలు ఉగ్రవాద దాడులు చేసింది. 2012 నుంచి ఈ ఉగ్రవాద సంస్థ యాక్టివ్‌గా ఉంది. 2023 డిసెంబర్లో ఇరాన్‌లోని ఒక పోలీస్ స్టేషన్‌పై జైష్ అల్ అదల్ గ్రూపు బాంబు దాడి చేసింది. ఈ దాడిలో 11 మంది పోలీసులు చనిపోయారు. జైష్ అల్ అదల్ గ్రూపుని అమెరికా కూడ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.
అయితే ఈ దాడిపై పాకిస్తాన్ ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ దాడిలో ఇద్దరు పిల్లలు చనిపోయారని, ముగ్గురు బాలికలు గాయపడ్డారని పాకిస్తాన్ అధికారుల తెలిపారు. పాకిస్తాన్ భూభాగంపై దాడి చేయడం అంటే తమ దేశ సార్వభౌత్వంపై దాడి చేయడమేనని పాక్ అధికారుల వ్యాఖ్యానించారు. ఈ దాడిని వారు ఖండిస్తున్నట్లు తెలిపారు.
పాకిస్తాన్, ఇరాన్ మధ్య చర్చలు జరిపే అవకాశాలున్నా.. ఈ దాడులు జరగడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఈ దాడికి సీరియస్ పరిణామాలుంటాయని.. ఇస్లామాబాద్‌లో ఉన్న ఇరాన్ దౌత్యాధికారులు దీనిపై వివరణ ఇవ్వాల్సి వస్తుందని మండిపడ్డారు.