Subsidiary Of KPS Digital Media Network

ఆంధ్రప్రదేశ్

త్వరలోనే జనసేనాని కీలక నిర్ణయం.. ఏపీ రాజకీయ స్వరూపం మారనుందా..

ఆంధ్రప్రదేశ్‌ : ఆంధ్రప్రదేశ్‌లో మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటి నుంచి పొలిటికల్‌ హీట్ మొదలైంది. గత కొంత కాలంలగా సవాల్‌.. ప్రతి సవాల్ నడుస్తున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం(TDP), జనసేన(Janasena) పార్టీలు ఎవరికి వారు తమ వ్యూహలతో ముందుకెళ్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో వరుసగా రెండో సారి గెలుపు తమదేనంటూ వైసీపీ అంటుంటే.. జగన్ పాలనపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని, టీడీపీ గెలుపు పక్కా అంటూ సైకిల్ పార్టీ అంటోంది. ఇక అనూహ్యంగా తమ బలం పెరిగిందని జనసేన ప్రచారం చేస్తోంది.

మరోవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని.. అన్ని సీట్లలో గెలుపు ఎందుకు సాధ్యం కాదంటూ చెప్పుకొస్తున్నారు. సీఎం జగన్(Jagan) తమ పార్టీ శ్రేణుల్లో ఉత్సహం నింపడానికి, కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌ పెంచడానికి ఈ మాటలు పనికిరావచ్చేమో కాని.. ప్రస్తుతం ఏపీ రాజకీయాలపై అవగాహన ఉన్న ఎవరికైనా ఒకే పార్టీకి 175 సీట్లు రావడం సాధ్యం కాదనే విషయం తెలుసు. మరోవైపు జనసేనాని పవన్‌ కళ్యాణ్ మాత్రం తాము గెలవడం పక్కనపెడితే వైసీపీని మాత్రం ఈసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యంతో ముందుకెళ్తున్నారంట. దానికోసం ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఎవరు అవునన్నా కాదన్నా.. పవన్‌ కళ్యాణ్‌కు ఎక్కువుగా మద్దతు పలికేది కాపు సామాజికవర్గమే. అయితే ఆ సామాజిక వర్గంలో వంద శాతం పవన్‌ కళ్యాణ్ వైపే లేనప్పటికి.. మెజార్టీ మాత్రం జనసేనకే జై కొడుతున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో కాపు సామాజిక వర్గం ఓట్లు అధికంగానే ఉన్నాయి.

ఎస్సీ, బీసీల తర్వాత.. అధికంగా ఓట్ల శాతం కాపులదే. దీంతో ఆ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీలు తమ ప్రయత్నాలు ప్రారంభించాయి. మరోవైపు పవన్‌ కళ్యాణ్ బహిరంగంగా చెప్పకపోయినా కాపు సామాజిక వర్గం ఓట్ల మీదనే ఎక్కువ ఆధారపడుతున్నారనేది బహిరంగ రహస్యం.

దీంతో సింగిల్‌గా పోటీ చేసినా లేదా బీజేపీతో వెళ్లినా.. 2019 నాటి ఫలితాలే రిపీట్ అవుతాయనే ఆలోచనలో పవన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో ఎక్కువ లేట్ చేయకుండానే వీలైనంత త్వరగా.. రాజకీయంగా జనసేనాని కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని పవన్‌ కళ్యాణ్ ఇప్పటికే డిసైడ్‌ అయినప్పటికి.. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తును పవన్‌ కోరుకుంటున్నారని జనసేన వర్గాల్లో వినిపిస్తోంది.

మోదీ అంటే ఎనలేని అభిమానమున్న పవన్‌(Pawan Kalyan).. బీజేపీతో కటీఫ్ చెప్పడానికి సంచయిస్తున్నారట.. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుకోసం చివరి క్షణం వరకు వేచిచూడాలనే అభిప్రాయంతో పవన్‌ ఉన్నట్లు సమాచారం. అప్పటికి బీజేపీ.. తెలుగుదేశంతో జతకట్టేందుకు సిద్ధంగా లేకపోతే మాత్రం.. కమలంతో దోస్తికి రాంరాం చెప్పి.. సైకిల్‌ పార్టీతో పొత్తుపై ప్రకటన చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఎన్నికలు దగ్గరపడిన తర్వాత ఈ నిర్ణయం ప్రకటిస్తే అసంతృప్తి నేతలను బుజ్జగించడం కష్టతరమవుతుందని, అందుకే మరో రెండు నుంచి మూడు నెలల్లోపై పొత్తులపై తేల్చేయాలనే ఉద్దేశంతో పవన్‌ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పవన్‌ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే మాత్రం ఏపీలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. ఇప్పటికే పలు అంశాలపై పవన్‌ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి తాజా రాజకీయాలపై చర్చించిన విషయం తెలిసిందే. ఇక టీడీపీతో పొత్తుపై అధికారిక ప్రకటన వస్తే మాత్రం.. పొలిటికల్‌ హీట్ మరింత పెరగనుంది.

తాజాగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, సీఎం జగన్మోహన్‌ రెడ్డి తెనాలిలో జరిగిన ఓ సభలో మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన విడివిడిగా 175 స్థానాల్లో పోటీచేయాలని సవాల్ చేశారు. అంటే రెండు పార్టీలు కలిస్తే మాత్రం వైసీపీ గెలుపు కష్టమని, రెండు పార్టీలు విడివిడిగా పోటీచేస్తే తమ గెలుపు నల్లేరుపై నడక అవుతుందనే ఉద్దేశంతోనే జగన్‌ ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది జనసేనాని పవన్‌ కళ్యాణ్ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందనే చర్చ విస్తృతంగా జరుగుతోంది.

Leave a Reply

Support

Support

Typically replies within an hour

I will be back soon

Support
Hello 👋 Thanks for your interest in us. Before we begin, may I know your name?
Start Chat with:
chat Need Help?
×