ఆంధ్రప్రదేశ్

చిత్తూరు జిల్లాలో ఘోరం, ఇద్దరు చిన్నారులతో సహా నలుగురి మృతి

చిత్తూరు : ఎంతో సంతోషంగా వారందరూ ట్రాక్టర్ పై పెళ్లికి బయలుదేరారు. ఆ సంతోషం ఎంతో సేపు ఉండదని పాపం వారికి ఆ క్షణాన తెలీదు. ఆ పల్లెటూరిలో గతుకుల రోడ్డుపై నుంచి ట్రాక్టరు స్పీడుగా వెళుతోంది. ట్రాక్టరు తొట్టెలో కూర్చున్నందరూ జోక్స్, నవ్వులతో సాగిపోతున్న వారి ప్రయాణంలో ఒక్కసారిగా భారీ కుదుపు ఏర్పడింది.

హాయిగా పెళ్లికి వెళుతున్నామని అనుకునేలోపు ఉన్నట్టుండి ట్రాక్టరు బోల్తా పడింది. అంతే ఆ క్షణంలో హాహాకారాలు, ఆక్రందనలతో ఆ ప్రాంతం దద్ధరిల్లిపోయింది. బలమైన ఆ ఇనుప ట్రాక్టరు తొట్టె కింద ఉండిపోయిన ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు మరణించారు. వీరితోపాటు డ్రైవరు కూడా మరణించాడు. 12 మందికి తీవ్ర గాయాలై, సమీప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

వివరాల్లోకి వెళితే…

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం వద్ద లక్ష్మయ్య గ్రామం సమీపంలో 25మందితో పెళ్లికి వెళుతున్న ట్రాక్టరు బోల్తా పడి ఆరుగురు మరణించారు. వీరంతా ఐరాల మండలం జంగాలపల్లి గ్రామానికి చెందినవారు. అందరూ కలిసి సమీప బంధువుల ఇంట్లో పెళ్లికి బయలుదేరారు.

క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికప్పుడు 108 వాహనాలు రావడంతో సకాలంలో వారిని ఆసుపత్రికి చేర్చగలిగారని స్థానికులు చెబుతున్నారు. డ్రైవరు మద్యం మత్తులో ఉండి నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రమాదం సంగతి తెలిసిన వెంటనే కలెక్టర్, ఎస్పీ ఇద్దరూ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాట్లను దగ్గరుండి చూశారు.

Leave a Reply