ఆంధ్రప్రదేశ్

అంబటి రాయుడు సెకండ్ ఇన్నింగ్స్‌ .. పాలిటిక్స్‌లో సక్సెస్ అవుతాడా..?

న్యూస్ వన్ టీవీ, ఆంధ్రప్రదేశ్‌ :- తన ఆటతో కొంతకాలం పాటు క్రికెట్‌ స్టేడియంలో మెరిసిన అంబటి తిరుపతి రాయుడు తన రాజకీయ ఇన్నింగ్స్‌ ప్రారంభించాడు. ఇటీవల కాలంలో క్రికెట్‌లో అవకాశాలు రాకపోయినా లేటెస్ట్‌గా వైసీపీ నుండి రాజకీయ రంగప్రవేశం చేశాడు. అయితే, ఈ క్రికెటర్ రాజకీయాల్లో రాణించగలుగుతాడా అనుకుంటున్నారంతా… పాలిటిక్స్‌లో ఫేట్‌ను చూసుకుంటున్న రాయుడుకి సీటు వస్తుందా…? ఒకవేళ దక్కితే పోటీ చేసే స్థానం నుంచి గెలుపొందుతాడా..? క్రికెటర్‌గా ఫెయిల్ అయినా పాలిటిక్స్‌లో సక్సెస్ అవుతాడా…?

అంబటి తిరుపతి రాయుడు… 1985, సెప్టెంబర్ 23న గుంటూరులో జన్మించాడు. 16 సంవత్సరాల వయసు నుంచే రాయుడు క్రికెట్ ఆడటం ప్రారంభించి, తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించాడు. 2004 ICC అండర్-19 క్రికెట్ ప్రపంచకప్‌లో భారతదేశ అండర్-19 జట్టుకు నాయకత్వం వహించాడు. అదే ఊపుతో సీనియర్ జట్టులోకి ప్రవేశించాలని భావించాడు. అయితే, క్రీడాకారులతో పాటు రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌తో ఏర్పడిన పలు వివాదాలు అతని జీవితాన్ని అక్కడితో ఆపేశాయి. ఇండియన్ క్రికెట్ లీగ్‌ నుండే “రెబల్” క్రికెటర్‌గా రాయుడు పేరు మార్మోగింది. 2012లో మొదటిసారిగా భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. జూలై 2013లో జింబాబ్వేతో జరిగిన ODIలో అంతర్జాతీయంగా అరంగేట్రం చేశాడు. అయితే, అది ఎక్కువ సేపు నిలబడలేదు. 2019 ICC ప్రపంచ కప్ కోసం భారత జట్టు నుండి రాయుడు తొలగించబడ్డాడు. ఆ తర్వాత, రాయుడుకి ఐస్లాండ్ క్రికెట్ బోర్డు నుండి ఐస్లాండ్ జట్టులో చేరడానికి ఒక ఆఫర్ వచ్చింది. అయితే, రాయుడు దానిని తిరస్కరించాడు. 2019లో రాయుడు అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. తక్కువ సమయం ఎక్కువ పేరు, ఎక్కువ అవమానం… ఇప్పుడు, రాయుణ్ని రాజకీయాల వైపుకు మళ్లించింది.

ఇలా క్రికెట్లో వివాదాలతో చిక్కుకొని ఫెయిల్ అవ్వటంతో తన మొదటి ఇన్నింగ్స్‌ను అసంపూర్తిగానే ముగించాడు రాయుడు. ఇక ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి, తన రెండు ఇన్నింగ్స్‌ను ప్రారంభించాలని అనుకున్నాడు. ఇటీవల సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో జాయిన్ అయ్యారు. వైసీపీ తరఫున గుంటూరు ఎంపీగా అంబటి రాయుడు పోటీ చేయబోతున్నారని ఇప్పటికే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే అంబటి రాయుడు కూడా పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ స్థానికంగా ఉన్న సమస్యలు తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నారని తెలుస్తుంది. అయితే, అంబటి రాయుడికి గుంటూరు ఎంపీగా అవకాశం లభిస్తుందా అనేది కొందరు నేతల్లో ఉన్న అనుమానం.

ప్రస్తుతం గుంటూరు ఎంపీగా తెలుగుదేశం పార్టీ నేత గల్లా జయదేవ్ ఉన్నారు. అయితే, ఇటీవల పరిణామాల రిత్యా ఇకపై గల్లా ఫ్యామిలీ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంబటి రాయుడికి అవకాశం లేకపోలేదు. ఇక, గత ఎన్నికల్లో వైసీపీ నుండి గుంటూరు లోక్‌సభ అభ్యర్థిగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పోటీ చేసి, ఓడిపోయారు. అయితే, మోదుగుల వైసీపీ కంటే ముందు టీడీపీ నాయకుడిగా ఉన్నారు. అయితే, ప్రస్తుతం వైసీపీ మార్పు చేర్పుల మార్గంలో ఉంది కాబట్టి అంబటి రాయుడికి అవకాశం లేదని చెప్పలేము. ఒకవేళ, వస్తే గుంటూరు ప్రజలు ఆయన్ను ఎలా ఆదరిస్తారో వేచి చూడాలి.

అయితే, రాయుడు రాజకీయాల్లో రాణించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాకపోతే తన దూకుడు స్వభావంతో క్రికెట్లో అవకాశాలు కోల్పోయిన వ్యక్తి, రాజకీయాల్లో ఎలా ఉంటారా అని పార్టీ వర్గాల్లో చర్చ మొదలయ్యింది. అధిష్టానం గుంటూరు పార్లమెంట్ కేటాయించే అవకాశం ఉన్నప్పటికీ రాయుడు గెలుపు అంత సులువుగా రాదని కూడా భావిస్తున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ క్యాడర్‌ను బలంగా నిర్మించారు. దాన్ని దాటి రాయుడు పొలిటికల్ పిచ్ పైన ఎలా ఆడగలడు అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. ఒకపక్క ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, అభ్యర్థుల మార్పులతో గందరగోళం, అమరావతి రాజధాని అంశాలతో ఇబ్బందులు ఉన్నప్పటికీ గెలుపుపై అంబటి రాయుడు ధీమాగా ఉండటం విశేషం. ఏది ఏమైనా, క్రికెట్లో ఫెయిల్ అయిన కనీసం రాజకీయాల్లో అయిన రాణించాలని అంబటి రాయుడు గ్రౌండ్ వర్క్ భారీగా చేసుకుంటున్నారని సమాచారం. మరి అంబటి రాయుడు రాజకీయాల్లో సక్సెస్ అవుతారా లేక ఫెయిలవుతారా అనేది వేచి చూడాలి.

Leave a Reply