జాతీయ వార్తలు

తాగొచ్చి పాఠాలు చెప్పే టీచర్.. పిల్లలు ఏం చేశారంటే?..

న్యూస్ వన్ టీవీ, మధ్యప్రదేశ్ :- ఒకవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని ప్రగల్భాలు పలుకుతుంటే.. మరోవైపు ప్రభుత్వ స్కూల్ టీచర్లు కొంతమంది చదువులు చెప్పకుండా ఇష్టారాజ్యం కొనసాగిస్తున్నారు. అలాంటి ఒక స్కూల్ టీచర్ తరుచూ తాగొచ్చి తరగతి గదుల్లో పిల్లల ముందు తూగుతూ ఉంటాడు. అయితే ఆ టీచర్ కు పిల్లలు, స్కూల్ లో పనిచేసే మరో ఉపాధ్యాయుడు కలిసి బుద్ధి చెప్పారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని షాహ్ దోల్ నగరంలో జరిగింది.

షాహ్ దోల్ నగరంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసే ఉదయ్ భాన్ సింగ్ నాత్ అనే వ్యక్తి పిల్లలకు పాఠాలు చెప్పకుండా తరుచూ స్కూల్ కు తాగొచ్చి తరగతి గదిలోనే నిద్రపోతుంటాడు. పిల్లల ముందే కాళ్లు కుర్చీపై పెట్టి తూగుతూ వాళ్లకు చదవుకోండి అని చెప్పి గురకలు పెడుతుంటాడు. టీచర్ ఉదయభాన్ సింగ్ రోజూ స్కూల్ కు తాగొస్తున్నాడని.. తరుచూ విధులకు ఆలస్యంగా వచ్చి త్వరగా ఇంటికి వెళ్లిపోతాడని స్థానికులు, పిల్లల తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులకు పలు మార్లు ఫిర్యాదు చేశారు. కానీ పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు.

అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఉదయభాన్ సింగ్ కు పిల్లలు పాఠం నేర్పాలని నిర్ణయించుకున్నారు. పిల్లలతో పాటు అదే స్కూల్ లో పనిచేసే టీచర్ కలిసి ఉపాధ్యాయుడు రోజూ లాగే మద్యం సేవించి తరగతి గదికి రాగానే మొబైల్ ఫోన్ లో అతని వీడియోలు తీశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ విద్యాశాఖ అధికారులపై ప్రభుత్వం సీరియస్ అయింది.

పై నుంచి ఒత్తిడి రావడంతో అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. టీచర్ ఉదయ్ భాన్ సింగ్ ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తరువాత ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంతకుముందు ఉదయ్ భాన్ సింగ్ కు హెచ్చరించినా అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో అతన్ని సస్పెండ్ చేశామని ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply