టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు కన్నుమూత
చెన్నై : ఎన్నో ఆశలు, ఆశయాలు, ఎంతో ఉన్నతమైన భవిష్యత్తు, అందమైన జీవితం…ఎన్నో కలలతో త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఆ యువకుడు అర్థాంతరంగా ప్రాణాలు వదిలిన సంఘటన అందరి మనసులను కలచి వేసింది.
చివరికి మూడు రోజులుగా మృత్యువుతో పోరాడి అలసిపోయిన ఆ యువకుడు కన్నుమూశాడు. మరో కొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వాడు, పాడి మీదకు చేరుకోవడంతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.
పెళ్లికొడుకు చంద్రమౌళి…చెన్నైలో తన వివాహ ఆహ్వాన కార్డులు పంచుతూ సన్నిహితుల ఇంటివద్ద గుండెపోటుతో సడన్ గా పడిపోయాడు. వెంటనే అతన్ని దగ్గరలో ఉన్న కావేరీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో మొదట వెంటిలేటర్ పై చికిత్స అందించారు. తర్వాత ఎక్మో ద్వారా చికిత్స అందించారు. అయితే వైద్యులు తమ శాయశక్తులా బతికించడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. మూడురోజుల తర్వాత చంద్రమౌళి శాశ్వత నిద్రలోకి చేరుకున్నాడు.
కర్నూలు జిల్లా నందికొట్కూరుకి మృతదేహాన్ని తల్లిదండ్రులు తరలించనున్నారు. ఇటీవలే చెన్నై పారిశ్రామిక వేత్త, టీటీడీ చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్ రెడ్డి కుమార్తెతో వివాహం నిశ్చయమయింది. త్వరలోనే వివాహం జరగాల్సి ఉంది. ముంబాయిలో ఉద్యోగం చేస్తున్న చంద్రమౌళి చెన్నై వచ్చి కార్డులు పంచుతూ కన్నుమూయడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.