జాతీయ వార్తలు

ప్రపంచంలో అతి పెద్ద తాళం.. రామ మందిరానికి కానుక..

న్యూస్ వన్ టీవీ, అయోధ్య :- అయోధ్య శ్రీరాముని ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా హనుమ, రామ భక్తులు ప్రపంచానికి తెలిసేలా తమ భక్తిని చాటుతున్నారు. ఎంత భక్తో అని కీర్తించేలా రాములోరికి భారీ కానుకలు చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీఘర్‌ జ్వాలాపురికి చెందిన సత్యప్రకాష్‌ శర్మ కుటుంబ సభ్యులు ఆలయానికి 4 వందల కిలోలున్న తాళాన్ని కానుకగా ఇచ్చారు.

ఇది ప్రపంచంలోనే అతి పెద్ద తాళంగా గుర్తింపు పొందింది. దీని తాళం చెవి మూడు అడుగుల నాలుగు అంగుళాలు పొడవు ఉంది. ఈ తాళం చెవి బరువు 30 కిలోలు . సత్యప్రకాష్ శర్మతోపాటు ఆయన భార్య రుక్మణి, కుమారుడు మహేష్ చంద్ కలిసి ఈ తాళాన్ని తయారు చేశారు. తాళం తయారీకి రూ.5 లక్షలు రూపాయలు ఖర్చు అయిందని రుక్మణి తెలిపారు.

గత ఏడాది సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సత్యప్రకాష్, అతని భార్య రుక్మణి ప్రధానిని కలిశారు. తాము స్వయంగా తయారుచేసిన ఆరు కిలోల తాళాన్ని మోదీకి బహుమతిగా అందజేశారు. అలాగే అయోధ్య రామ మందిరానికి 400 కిలోల బరువు కలిగిన భారీ తాళం తయారు చేశామని తెలిపారు. ఆలయ ప్రారంభోత్సవ సమయానికి అందజేస్తామని ఆ దంపతులు మోదీకి చెప్పారు.

సత్యప్రకాష్ గత ఏడాది డిసెంబర్12 న గుండెపోటుతో మృతి చెందారు. ఆయన కోరిక తీర్చేందుకు ఈ భారీ తాళాన్ని అయోధ్యలో సమర్పించేందుకు మహామండలేశ్వర్ డాక్టర్ అన్నపూర్ణ భారతీ పూరీ మహారాజ్‌కు సత్యప్రకాశ్ భార్య రుక్మణి, కుమారుడు మహేష్ చంద్ అందజేశారు.

Leave a Reply