జాతీయ వార్తలు

ఈ సారి బీజేపీకే ఎక్కువ సీట్లు.. కానీ..?

న్యూస్ వన్ టీవీ, జాతీయం :- సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరోసారి ఎక్కువ స్థానాలు గెల్చుకున్న పార్టీగా అవతరించనుందని కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌ అన్నారు. అయినప్పటికీ ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటు చేయలేదని ఆయన జోస్యం చెప్పారు. భాగస్వామ్యపక్షాలు ఆ పార్టీకి మద్దతు ఇవ్వకపోవచ్చని అభిప్రాయపడ్డారు. కేరళ సాంస్కృతిక మహోత్సవంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.

బీజేపీ పార్టీ సీట్లు గతంలో పోలిస్తే ఈ సారి భారీగా తగ్గుతాయని శశిథరూర్ అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా సీట్లు రాకపోవచ్చన్నారు. ఎన్డీయే కూటమిలోని పార్టీలు ఆ పార్టీకి మద్దతిచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఆ పార్టీలు ఇండియా కూటమికే మద్దతు ఇస్తాయన్నారు. ఈ సందర్భంగా ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం గురించీ మాట్లాడారు. కొన్ని రాష్ట్రాల్లో భాగస్వామ్యపక్షాల మధ్య పరస్పర అంగీకారం కుదరొచ్చన్నారు. మరికొన్ని చోట్ల కుదరకపోవచ్చని శశిథరూర్ పేర్కొన్నారు. కూటమిలో సీట్ల పంపకం విషయంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుందని పేర్కొన్నారు.

కేరళను ఉదాహరణగా తీసుకుంటే.. కూటమిలో భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్‌, సీపీఎం మధ్య సీట్ల పంపకం కలలోనూ ఊహించలేమని శశి థరూర్‌ అన్నారు. తమిళనాడు విషయానికొస్తే.. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌, డీఎంకే కలిసి పనిచేయడంలో ఎలాంటి ఇబ్బందీ ఉండ బోదన్నారు. గత ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తమ నియోజకవర్గంలో బరిలో నిలిచిన అభ్యర్థిని చూసి ఓటేయాలని ఓటర్లకు శశి థరూర్‌ సూచించారు. ‘మోదీ మోదీ’ నినాదాలు చేసేవారిని కాకుండా.. సరైన అభ్యర్థిని ఎంచుకోవాలన్నారు. వారణాసి ప్రజలు మాత్రమే మోదీకి ఓటేయగలరన్నారు. చట్ట సభల్లో ప్రజా వాణిని వినిపించే వారిని ఎన్నుకోవాలని శశి థరూర్ ఓటర్లకు సూచించారు.

Leave a Reply