కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం: లోకేశ్
న్యూస్ వన్ టీవీ, వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. కర్నూలులోని జిల్లా కోర్టు భవనం వద్దకు చేరుకున్న లోకేశ్ పాదయాత్రకు పలువురు న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా లోకేశ్ వారితో మాట్లాడుతూ సీఎం జగన్ మాదిరి మాట మార్చి, మడమ తిప్పే బ్యాచ్ టీడీపీది కాదన్నారు. అధికారంలోకి రాగానే కర్నూలులో హైకోర్టు బెంచ్ కచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతామని.. ఇందుకు తనది పూచీ అని స్పష్టం చేశారు. దీంతో లోకేశ్‌కు న్యాయవాదులు ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం 50వ డివిజన్ ప్రజలు లోకేశ్ ను కలిసి ప్రభుత్వం టిడ్కో ఇళ్లు ఇవ్వడం లేదని వినతిపత్రం సమర్పించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 90శాతానికి పైగా పూర్తి చేసిన టిడ్కో ఇళ్లను పూర్తి చేసి ప్రజలకు ఇవ్వకుండా సైకో ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ ప్రభుత్వం వస్తే లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు అందజేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. కాగా యువగళం పాదయాత్ర 93వ రోజుకు చేరుకుంది.