చైనాలో అర్థరాత్రి ఘోరం ప్రమాదం – 17 మంది మృతి – 22 మందికి గాయాలు
చైనా : డ్రాగన్ కంట్రీ చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శనివారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత జియాంగ్సి ప్రావిన్స్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు వల్ల ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో పలు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో 17 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 22 మంది వరకు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న అంశంపై క్లారిటీ రావాల్సివుంది.
నానా చాంగ్ కౌంటీ ట్రాఫిక్ పోలీసుల కథనం మేరకు… పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనపించడం లేదనిస, అందువల్ల వాహనదారులు మరింత జాగ్రత్తతో వాహనాలు నడపాలని సూచించారు. ముందు ప్రయాణిస్తున్న వాహనానికి తగినంత దూరంలో ఉండేలా జాగ్రత్తలు పాటించాలని కోరారు. అలాగే లైన్ మారడం లేదా ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయడం వంటివి చేయరాదని సూచించారు.
దట్టమైన పొగమంచు వల్ల రోడ్డు సరిగా కనిపించక ప్రమాదాలు చోటుచేసుకోవడం చైనాలా సర్వసాధారణంగా మారింది. ఇటీవల హెనాన్న ప్రావిన్స్‌లోని ఓ వంతెనపై సుమారు 200 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆ సమయంలో కూడా పలువురు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు.