దేశ ప్రయోజనాలే ముఖ్యమన్న కేంద్ర మంత్రి
న్యూస్ వన్ టీవీ, ఢిల్లీ :- భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే విషయంలో భారత్‌కు ఎలాంటి తొందరా లేదని కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని, డెడ్‌లైన్‌లను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఒప్పందాలకు అంగీకరించబోమని చెప్పారు. ఇరువురికీ ప్రయోజనకరమైన ఏ నిర్ణయానికైనా అంగీకరిస్తామని తెలిపారు (Piyush Goyal On Trade Deals). అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల విధింపునకు తుదిగడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో మంత్రి ఈ కామెంట్స్ చేశారు. మధ్యంతర వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరుకుందన్న వార్తల నేపథ్యంలో కేంద్రమంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఢిల్లీలో ఓ ఎక్స్‌పోలో పాల్గొన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అంతర్జాతీయ వాణిజ్య చర్చల విషయంలో భారత్ పంథాను వివరించారు. వాణిజ్య సిద్ధాంతాల ఆధారంగా భారత్ తన ప్రయోజనాలకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
‘ఏ ఒప్పందమైనా ఉభయులకూ ప్రయోజనకరంగా ఉండాలి. భారత ప్రయోజనాలకు కూడా రక్షణ ఉండాలి. జాతి ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం. ఈ అంశాల ఆధారంగా అభివృద్ధి చెందిన దేశాలతో మంచి డీల్ కుదిరితే భారత్ అందుకు ఎప్పుడూ సిద్ధమే. ప్రస్తుతం అనేక దేశాలతో చర్చలు జరుగుతున్నాయి. తుది ఒప్పందంపైనా చర్చలు కొనసాగుతున్నాయి. ఐరోపా సమాఖ్య, న్యూజిలాండ్, యూఎస్, చిలీ.. ఇలా ఏ దేశంతోనైనా సరే పరస్పర ప్రయోజనాలు సమకూరినప్పుడే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సాధ్యమవుతుంది. జాతీయ ప్రయోజనాల పరిరక్షణ కోసం పూర్తిస్థాయి చర్చల తరువాతే డీల్‌ను ఆమోదిస్తామని’ అన్నారు.
అంతకుముందు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కూడా దాదాపు ఇవే వ్యాఖ్యలు చేశారు. రష్యా చమురు కొనుగోళ్లపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధిస్తాయన్న వార్తల నడుమ ఆయన మాట్లాడుతూ.. భారత్‌కు ప్రయోజనకరమైన ధరకు ఏ దేశమైనా ముడి చమురును విక్రయిస్తే కొనుగోలు చేసేందుకు భారత్ ఎప్పుడూ సిద్ధమేనని అన్నారు.
తమ లేబర్ ఇంటెన్సివ్ ఉత్పత్తులను అమెరికా మార్కెట్‌లోకి మరింతగా అనుమతించాలని భారత్ అగ్రరాజ్యాన్ని కోరుతోంది. కాగా తమ వ్యవసాయ ఉత్పత్తులను భారత మార్కెట్‌లోకి అనుమతించాలని అమెరికా కోరుతోంది. ఇక ట్రంప్ గతంలో ప్రకటించిన ప్రతీకార సుంకాలు జులై 9 నుంచి అమల్లోకి రానున్నాయి.