అత్యాచారం కేసులో విచారణకు డుమ్మా… నిత్యానందకు వారెంట్
బెంగుళూరు : వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామికి వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఓ అత్యాచారం కేసులో ఆయన విచారణకు హాజరుకాకపోవడంతో బెంగుళూరులోని రామనగర జిల్లా సెషన్స్ కోర్టు ఈ వారెంట్‌ను జారీచేసింది.
నిజానికి ఈ కేసులో నిత్యానంద స్వామిని విచారణకు రావాల్సిందిగా గత 2019లోనే కోర్టు సమన్లు జారీ చేసింది. కానీ, ఆయన అప్పటి నుంచి డుమ్మా కొడుతూ వచ్చారు. పైగా, ఆయన ఎక్కడ ఉన్నారో కూడా పోలీసులు గుర్తించలేకపోయారు. దీంతో బాధితులు కోర్టుకు తమ ఆందోళన తెలియజేశారు. ఫలితంగా నిత్యానందకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను కోర్టు జారీచేసింది.
ఇదిలావుంటే, ప్రస్తుతం నిత్యానంద కైలాస అనే స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేసినట్టు గత కొంతకాలంగా విస్తృతంగా ప్రచారం సాగుతోంది. అయితే, ఈ కైలాస దేశం ఎక్కడ ఉన్నదో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఈక్వెడార్ సమీపంలోని ఓ చిన్న దీవిని నిత్యానంద కొనుగోలు చేసి, దానికి కైలాస దేశం అని పేరు పెట్టారు.
ఈ వార్తలను ఈక్వెడార్ దేశం ఖండించింది. మరోవైపు, నిత్యానంద స్వామి ఎయిడ్స్ వ్యాధి కారణంగా చనిపోయాడనే వార్తలు కూడా వస్తున్నాయి. కానీ ఇటీవల ఓ వీడియో ద్వారా తాను ఇంకా జీవించివున్నట్టు, వైద్య చికిత్స పొందుతున్నట్టు తెలిపారు.