“చంద్రబాబు మాటలు విని షాకయ్యా.. మా హయాంలోనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది”
న్యూస్ వన్ టీవీ, అచ్యుతాపురం :- అచ్యుతాపురం సెజ్ లో మొన్న రాత్రి జరిగిన ప్రమాదంలో గాయపడి.. అనకాపల్లిలోని ఉషా ప్రైమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న 18 మంది బాధితులను, వారి కుటుంబాలను మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నిన్న సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడిన మాటలు విని షాకయ్యానని చెప్పారు. ఎప్పుడు చూసినా గత ప్రభుత్వ హయాంలో జరిగినవే చెబుతారు తప్ప.. ఇప్పుడు పరిస్థితి గురించి ఆలోచించరని యద్దేవా చేశారు.
ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి ఇంతవరకూ పరిహారం అందలేదని, వెంటనే వారికి పరిహారాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు. పరిహారం అంటేనే సహాయం చేయడమని, ఇప్పుడున్న ప్రభుత్వం దానిని కూడా ఆలస్యం చేస్తోందని దుయ్యబట్టారు.
అచ్యుతాపురంలో ప్రమాదం జరిగిన తర్వాత.. కలెక్టర్, అధికారులు ఘటనా ప్రాంతానికి వెళ్లడంలో జాప్యం చేశారన్నారు. వెంటనే అంబులెన్సులను కూడా పంపలేదని, బాధితులను కంపెనీ బస్సుల్లో ఆస్పత్రులకు తరలించిన దుస్థితి నెలకొందన్నారు. 2020 మే లో ఎల్జీ పాలిమర్స్ ల ఇలాంటి ఘటనే జరిగిందని, అప్పుడు వైసీపీ అధికారంలో ఉందన్నారు. కోవిడ్ సమయంలో ప్రభుత్వం ఎలా స్పందించిందో.. ఇప్పుడు ప్రభుత్వం ఎలా స్పందించిందో కంపేర్ చేసుకోవాలని సూచించారు. తెల్లవారుజామున 3.40 గంటలకు ఎల్జీ పాలిమర్స్ లో ఘటన జరిగితే 5 గంటలకల్లా కలెక్టర్ స్పాట్ కి వెళ్లారని, అంబులెన్సులు వెంటనే అక్కడికి చేరుకుని గాయపడినవారిని ఆస్పత్రికి తరలించాయన్నారు.
ఉదయం 6 గంటలకల్లా పార్టీకి చెందిన సీనియర్ నాయకులంతా స్పాట్ కి వెళ్లారని, 11 గంటలకల్లా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న తాను స్పాట్ కి వెళ్లానని తెలిపారు. 24 గంటల్లోనే కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించి.. 30 కోట్ల రూపాయలను అందించినట్లు జగన్ వివరించారు. 3 రోజులు ఆస్పత్రిలో ఉన్నవారికి రూ.10 లక్షలు, మైనర్ ఇంజూరీస్ జరిగిన వారికి రూ.3 లక్షలు, చిన్న గాయాలు అయినవారికి రూ.25 వేలు ఇచ్చామని తెలిపారు.
2014-19 వరకూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు జరగలేదా ? అని ప్రశ్నించారు. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వాలు వెంటనే స్పందించాయా ? సహాయక చర్యలు చేపట్టాయా ? రెస్పాన్సిబులిటీ తీసుకున్నాయా ? అన్నది చూడాలన్నారు. నాడు.. ఇప్పుడు సీఎస్ గా ఉన్న నీరభ్ ఆధ్వర్యంలోనే కమిటీ వేసి ఎంక్వైరీ చేశామన్నారు. కూటమి ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలని, నష్టపరిహారాన్ని అందజేయాలని జగన్ డిమాండ్ చేశారు.